Aug 18,2023 23:52
జిల్లా పంచాయతీ కార్యాలయం

ప్రజాశక్తి-బాపట్ల: జిల్లాలో వివిధ కారణాలతో గతంలో నిలిచిపోయిన గ్రామ పంచాయతీ సర్పంచుల, వార్డు మెంబర్ల ఎన్నికలను శనివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి దాసరి రాంబాబు తెలిపారు. జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ వార్డు ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. చుండూరు మండలం మున్నంగివారిపాలెం, ఇంకొల్లు మండ లం పావులూరులో సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికలతో పాటు జిల్లాలో 11 వార్డు మెంబర్ల ఎన్నికలను నిర్వహిస్తున్నామని తెలిపారు. చుండూరు మండలం మున్నంగివారిపాలెం గ్రామ పంచాయతీ జనరల్‌ అభ్యర్థులకు కేటాయించారు. అక్కడ పంచాయతీ సర్పంచ్‌ పదవి ఎన్నికల బరిలో అమ్మిశెట్టి శ్రీరామమూర్తి, తిప్పిరెడ్డి మల్లేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు. ఇంకొల్లు మండలం పావులూరు గ్రామ పంచాయతీ ఎస్సీలకు రిజర్వు అయింది. అక్కడ సర్పంచ్‌ అభ్యర్థులుగా బొల్లెద్దు లూధియమ్మ, వలేరు ఎలీషా పోటీలో ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 35వ వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వారిలో 24 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరగాల్సిన బాపట్ల మండలం జిల్లెళ్లమూడి గ్రామ పంచాయతీలో 6వ వార్డు, కర్లపాలెం మండలం బుద్ధాం గ్రామ పంచాయతీలో 6వ వార్డు, అమర్తలూరు మండలం మూల్పూరు గ్రామ పంచాయతీలో 2,4 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నగరం మండలం చిన్నమట్లపూడి గ్రామ పంచాయతీలో మూడో వార్డు, రేపల్లె మండలం బేతపూడి గ్రామ పంచాయతీలో ఏడో వార్డు, కొల్లూరు మండలం చిలుమూరు గ్రామ పంచాయతీలో 4, దోనేపూడి గ్రామ పంచాయతీలో ఐదో వార్డు, వేమూరు మండలం వరాహపురం గ్రామ పంచాయతీలో పదో వార్డు, అద్దంకి మండలం శంఖవరపాడు గ్రామ పంచాయతీలో ఎనిమిదో వార్డు, కారంచేడు మండలం స్వర్ణ గ్రామ పంచాయతీలో 13వ వార్డుకు పోటీలో ఉన్న సర్పంచ్‌, వార్డు మెంబర్‌ అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించినట్లు తెలిపారు.