ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కుమారుడు పుట్టాడని ఆ కుటుంబంలో ఆనందం ఓవైపు.. బంధుమిత్రులతో కలిసి సరదాగా బారసాల చేసుకుందామన్న ఆలోచన మరోవైపు... ఆ సంతోషం ఆ ఇంట ఎంతో సమయం నిలువలేదు. కొడుకు బారసాలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు తన మిత్రులతో కలిసి విజయనగరం మార్కెట్‌కు వచ్చిన ఆ తండ్రిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కొడుకు పుట్టాడని ఆనందిస్తున్న ఆ తల్లికి.. భర్త అకాల మరణ సమాచారం తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్నేహితుడి ఇంట శుభకార్యానికి సహాయం కోసం వెంట వెళ్లిన మిత్రుడినీ టిప్పర్ మింగేసింది. ఈ హృదయ విదారకర సంఘటన మంగళవారం రాత్రి నగరంలోని కే ఎల్ పురం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
మెంటాడ మండలంలోని కొంపంగి గ్రామానికి చెందిన జెసిబి డ్రైవర్‌గా పనిచేస్తున్న భోగిన సత్యనారాయణ(32)కు కొద్దిరోజుల క్రితం మొదటి సంతానంగా బాబు పుట్టాడు. దీంతో సత్యనారాయణ కుమారుని బారసాల సామగ్రిని కొనేందుకు మ్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్న తన మిత్రులైన అదే మండలం జక్కువ గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి సుందరరావు అలియాస్ రాజు (25), బొడ్డు గౌరీశంకర్‌తో కలిసి మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై విజయనగరం వచ్చారు. మార్కెట్ పనులు ముగించుకున్న అనంతరం ముగ్గురు విజయనగరంలో భోజనం చేసిన తర్వాత రాత్రి 10 గంటలు దాటాక తిరుగు పయనమయ్యారు. కె.ఎల్.పురం వద్ద ఆర్‌టిఒ కార్యాలయం నుంచి విజయనగరం వైపు వస్తున్న టిప్పర్ వారిని ఢకొీంది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రగాయాలైన సుందరరావు, గౌరీశంకర్‌ను జిల్లా కేంద్రాస్పత్రికి వెంటనే తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుందరరావు మరణించాడు. గౌరీ శంకర్ తీవ్ర గాయాలతో విశాఖలో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. వన్‌టౌన్ ఎస్‌ఐ గోపాల్, ఎఎస్‌ఐ జగన్మోహన్‌రావు కేసు నమోదు చేశారు.










