
ఇద్దరు కౌలు రైతుల ఆత్మహత్య
ప్రజాశక్తి - చాగలమర్రి
నంద్యాల జిల్లాలోని చాగలమర్రి, కొత్తపల్లి మండలాల్లో ఇద్దరు కౌలు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. చాగలమర్రి మండలం నేలంపాడు గ్రామానికి చెందిన కౌలు రైతు దూదేకుల బాష(45) సొంత పొలం 2 ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని గత ఐదేళ్లుగా జనప, ఉల్లి, మిరప తదితర పంటలను సాగు చేస్తున్నాడు. దిగుబడులు సరిగా రాక అప్పులు అధికమవ్వడంతో సొంత పొలం రెండు ఎకరాలను అమ్మేశాడు. అయినా చేసేదేమి లేక పొలం కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు. నష్టాలు రావడంతో దాదాపు రూ. 5 లక్షల వరకు అప్పులు మిగిలాయి. ఈ నెల 31న కూతురి పెళ్ళి ఉండటంతో డబ్బులు సమకూరక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఇంట్లో ఈ నెల 15వ తేది రాత్రి క్రిమి సంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆళ్ళగడ్డ వైద్యశాలకు తరలించగా ప్రధమ చికిత్స అనంతరం నంద్యాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొత్తపల్లి : కొత్తపల్లి మండలం నందికుంట గ్రామానికి చెందిన మైల సుధాకర్ (37) సొంత పొలం ఎకరా, మరో 3 ఎకరాల 40 సెంట్లు పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంటల సాగు కోసం సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు. గత ఏడాది అధిక వర్షాలు, ఈ ఉఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిని నష్టం రావడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో మధనపడుతూ ఈ నెల 14వ తేది గ్రామ శివారులో ఉన్న పొలాల్లో పురుగు మందు తాగాడు. అటుగా వెళ్తున్న కొంతమంది రైతులు, కూలీలు సృహా లేకుండా పడి ఉన్న సుధాకర్‌ను గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు హుటాహుటిన చేరుకొని ఆత్మకూరులోని ఓ వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యంకోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి భార్య మరియమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హుస్సేన్ భాష కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.