Jul 22,2021 21:59

ప్రజాశక్తి-అమరావతి : కోర్టు ధిక్కార కేసుల్లో ఇద్దరు ఐఎఎస్‌ అధికారులు విచారణకు హాజరుకాకపోవడంతో వారికి నాన్‌బెయిలబుల్‌ వారెంటు (ఎన్‌బిడబ్ల్యు)ను హైకోర్టు జారీ చేసింది. పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, బిసి సంక్షేమ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.అనంతరాములు హైకోర్టుకు గురువారం హాజరుకాలేదు. వారిని తమ ముందు హాజరుపర్చాలని గుంటూరు ఎస్‌పిని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ బి.దేవానంద్‌ ఎన్‌బిడబ్ల్యు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు అమలయ్యేలా చేయాలని డిజిపిని ఆదేశించారు. విచారణను ఆగస్టు 5కు వాయిదా వేశారు. తనకు చెల్లించాల్సిన 75 శాతం పెన్షన్‌, జిపిఎఫ్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, ఎన్‌క్యాష్‌మెంటు లీవ్‌ వంటివి పూర్తిగా పిటిషనర్‌కు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశిస్తే అమలు కాలేదు. దీంతో కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి మంగు శంకరాచార్యులు కోర్టు ధిక్కార కేసు దాఖలు చేశారు. అత్యవసరంగా ఢిల్లీ పర్యటనలో ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ద్వివేదీ మెమో జారీ చేశారు. ఇందుకు అనుమతి ఇవ్వని న్యాయమూర్తి ఆయనకు ఎన్‌బిడబ్ల్యు జారీ చేశారు. మరో కేసులో అనంతరాములుకు కూడా ఎన్‌బిడబ్ల్యు జారీ చేశారు.

అలాగే వేర్వేరు కోర్టు ధిక్కార కేసుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌తో సహా దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ జి.వాణీ మోహన్‌, ఆ శాఖ కమిషనరు అర్జున్‌రావు స్వయంగా విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణకు ఈ ముగ్గురు స్వయంగా హాజరుకావాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి మినహాయింపు ఉత్తర్వులు జారీ చేశారు.