Aug 25,2023 23:25
యువకులను కాపాడిన పోలీసులు, గజఈతగాళ్లను అభినందిస్తున్న డిఎస్పీ

      ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: బాపట్ల సూర్యలంక సముద్రతీరంలో ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడిన పోలీస్‌ సిబ్బందిని, గజ ఈతగాళ్లను బాపట్ల డిఎస్‌పి టి వెంకటేశులు అభినందించారు. శుక్రవారం బాపట్ల డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు ఉదయం బాపట్ల డిఎస్‌పి ఆయన కార్యాలయంలో పోలీసు సిబ్బందిని, గజ ఈతగాళ్లను ఘనంగా శాలువాతో సన్మానించి నగదు బహుమతులు అందజేశారు. ఈ నెల 23వ తేదీ బుధవారం బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో స్నానం చేస్తూ మంగళగిరికి చెందిన ఫణితపు దేవప్రకాష్‌ షన్ను, అందే ప్రశాంత్‌ అనే యువకులు అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్రంలోకి వెళ్లి ఆపదలో ఉన్న ఆ యువకులను సముద్రపు ఒడ్డుకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందజేసి వారి ప్రాణాలను కాపాడిన సూర్యలంక అవుట్‌ పోస్ట్‌లో విధులు నిర్వహించే హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం పోతురాజు, కానిస్టేబుల్‌ పి వెంకటరావు, సూర్యలంక మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించే హౌంగార్డు కె వెంకటనారాయణ, గజఈతగాళ్లు కొక్కిలిగడ్డ సుబ్బారావు, కొక్కిలిగడ్డ సత్యనారాయణ, మోకా గోపికృష్ణలను అభినందించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సూచనలతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే సూర్యలంక సముద్రతీరం వెంబడి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. యాత్రికుల రక్షణ కోసం సముద్ర తీరం వెంబడి గజఈతగాళ్లను నియమించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు యాత్రికులను అడ్రసింగ్‌ సిస్టమ్‌ ద్వారా పోలీస్‌ సిబ్బంది హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్నారన్నారు. కొంతమంది యువకులు పోలీసు సూచనలను, హెచ్చరికలను పెడచెవిన పెట్టి సముద్రం లోపలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహ్లాదకరంగా గడపడానికి సముద్రతీరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ప్రమాదాలు, సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా వారి పర్యటనను ముగించుకొని సంతోషంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతోనే పోలీసువారు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తుంటారన్నారు. యాత్రికులు పోలీస్‌ వారి సూచనలను తప్పనిసరి పాటించాలన్నారు. ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, మద్యం సేవించి సముద్రంలోకి దిగినా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, పోలీస్‌ వారి సూచనలు పెడచెవిన పెట్టినా, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో సూర్యలంక సముద్రతీరంలో ఎంతోమంది యాత్రికుల ప్రాణాలను పోలీసు సిబ్బంది, గజఈతగాళ్లు కాపాడారన్నారు. ఆగస్టు 23 బుధవారం ఇద్దరి యువకుల ప్రాణాలను పోలీస్‌ సిబ్బంది, గజఈతగాళ్లు ప్రాణాలకు తెగించి కాపాడారన్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపి, ఘనంగా సన్మానించి నగదు బహుమతి అందించినట్లు తెలిపారు. రాబోయే రోజులలో కూడా పోలీసు ప్రతిష్టను పెంచేవిధంగా విధులు నిర్వహించి, మిగిలిన పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, బాపట్ల పట్టణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ కృష్ణయ్య, బాపట్ల పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు, బాపట్ల ట్రాఫిక్‌ ఆర్‌ఎస్‌ఐ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.