ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ చట్టానికి (గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ- జిఎన్‌సిటిడి) కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటివి. ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఉన్న నిర్వచనాన్ని సమూలంగా మార్చివేసి లెఫ్టినెంట్ గవర్నర్‌నే ప్రభుత్వమని సవరణ బిల్లులో పేర్కొనడం దారుణం. ఎల్‌జినే ప్రభుత్వమైతే ...ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజలు ఎన్నుకున్న ఇతర ప్రతినిధులు ఎవరు? రాజ్యాంగంలో పేర్కొన్న వారి అధికారాల సంగతేంటి? శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా తిరస్కరించడం లేదా అట్టిపెట్టుకునే అధికారాన్ని ఈ బిల్లు లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతుంది. అంతేకాదు, పరిపాలనకు సంబంధించి ఏ నిర్ణయాన్నయినా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఎల్‌జితో సంప్రదించి, ఆయన అంగీకారం తెలిపిన తరువాతే తీసుకోవాలని బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. దీనర్ధం ఏమిటి? లెఫ్టినెంట్ గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని, ఇది నూరుశాతం రాజకీయ నియామకమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి)కు సర్వాధికారాలు బదిలీ అవుతాయి. అంటే, కేంద్ర ప్రభుత్వమే చక్రం తిప్పుతుంది. అదే జరిగితే ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా కేంద్ర పరిపాలనే సాగుతుంది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేకుండా చేయడం ప్రజాస్వామ్యంపై దాడికాక మరేమిటి? ముఖ్యమంత్రి నుండి మంత్రులు, ఎంఎల్‌ఎలు చివరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమ చెప్పుచేతుల్లోకి తీసుకుని, డూడూ బసవన్నలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన సమాఖ్య తత్వానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు పూర్తి విరుద్ధం.
2015లో ఆప్ ప్రభంజనంతో ఢిల్లీలో ఓటమి పాలైన బిజెపి, అక్కడ మళ్లీ అధికారంలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా, ఢిల్లీ ప్రజానీకం 2020 ఎన్నికల్లోనూ కమలనాథులను తిరస్కరించారు. జాతీయ స్థాయిలో అధికారం పొందినప్పటికీ ఢిల్లీలో ఓడిపోవడం వారికి మింగుడుపడనిదిగా మారింది. అప్పటి నుండి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పెడుతున్న ఇబ్బందులకు పరాకాష్టగా తాజా బిల్లును నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీచేసి గెలవలేక, దొడ్డిదోవన అధికారాన్ని దక్కించుకోవడానికి ఈ తరహా కుయుక్తులకు దిగడం మోడీ సర్కారుకు కొత్తేమీ కాదు. ఇతర పార్టీల నుండి గెలిచిన ఎంఎల్‌ఏలను సంతలో పశువుల్లాగా కొనేసి రాష్ట్రాల్లో ప్రభుత్వాల రంగులు మార్చి వేయడం కమలనాథులకు వెన్నతో పెట్టిన విద్య. ఈ తరహా కుట్రలు కుదరని చోట్ల నయానో, భయానో రాష్ట్ర ముఖ్యమంత్రులను తమ చెప్పుచేతుల్లో ఉంచుకునే విన్యాసాలు ప్రదర్శించారు. అవీ పారని చోట.. చట్టాలకు తూట్లు పొడిచైనా సరే, తమదే పై చేయనిపించుకోవడానికి కమలనాథులు బరితెగిస్తున్నారు. గత ఏడాది జమ్మూకాశ్మీర్‌ను ముక్కలు చేసి, రాష్ట్రపతి పాలన రుద్దారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ద్వారా అక్రమాలను సాగించి, అక్కడి ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు. ఇప్పుడు ఢిల్లీ సర్కారుపై వెనుక నుండి పెత్తనం చేయడానికి నిస్సిగ్గుగా తెగబడ్డారు. సహకార ఫెడరలిజం అని ధర్మ పన్నాలు వల్లిస్తూ కాషాయ నేతలు తొక్కుతున్న అడ్డదారులివీ!
రాజ్యాంగంలోని 239ఎఎ అధికరణం ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా పేర్కొనడంతో పాటు, ప్రజలు ఎన్నుకున్న శాసనసభను కలిగిఉండటానికి ప్రత్యేక అధికారాన్ని ఇచ్చింది. దీనిపై 2018లో తలెత్తిన వివాదంలో అధికారం పేరుతోనో, మరో సాకుతోనూ ప్రజల తీర్పుకు గండికొట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇప్పటికీ 239ఎఎ అధికరణం ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. అయినా, సుప్రీం తీర్పుకు కొత్త భాష్యం చెబుతూ తోకతో తలను ఆడించడానికి మోడీ సర్కారు సిద్ధమైంది. ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ఈ తరహా కుట్రలను, కుతంత్రాలను, నిరంకుశ పోకడలను తిప్పికొట్టాలి.










