ఇచ్చిన 'మాట' ఏమాయే...!
అనుప్పల్లి రైతులు
68 నెలలుగా నిరీక్షణ
ప్రజాశక్తి - రామచంద్రాపురం
'మాటకు కట్టుబడి ఉండాలి' అదే పాలకునికి విలువ, మర్యాద. అలాకాకుండా హామీలిచ్చేసి 'మాట తప్పను... మడమ తిప్పను' అని డాంభికాలు పలుకుతూ, హామీలను నెరవేర్చకపోతే జనం కూడా ఎల్లకాలం మోసపోరు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు కోసం ఒక్కనెల రెండు నెలలు కాదు.. 68 నెలలుగా అనుప్పల్లి రైతులు నిరీక్షిస్తూనే ఉన్నారు..
ఉమ్మడి చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ నెమళ్లగుంటపల్లి గ్రామంలో ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2018, జనవరి 10న రైతు సదస్సు నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనూ, కాంగ్రెస్ హయాంలోనూ భూపంపిణీ కార్యక్రమం కింద అనుప్పల్లి రెవెన్యూ లెక్కదాఖలాలోని పేదలకు దరఖాస్తు పట్టాలను మంజూరు చేశాయి. కానీ సర్వే నంబర్ 410 నుండి 493 వరకూ రెవెన్యూ అధికారులు ఇంప్లిమెంటేషన్ చేయడంలో నిర్లక్ష్యం చూపారు. అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేదనే ఉద్దేశ్యంతో రెవెన్యూ అధికారులు విచారణ జరిపి దరఖాస్తు పట్టాలను రద్దు చేశారు. అనుప్పల్లి పంచాయతీలో 200 మంది రైతులకు సంబంధించి 300 ఎకరాల డికెటి భూములను 2017, జులైలో అప్పటి కలెక్టర్ ప్రద్యుమ్న రద్దు చేశారు. ఈ విషయమై వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి, వైసిపి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి, స్థానిక ఎంఎల్‌ఎ చెవిరెడ్డి దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా రైతు సదస్సులో 'వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూములు మీకు ఇప్పిస్తా' అని హామీ ఇచ్చారు. అయితే అనుపల్లి పంచాయతీలో రద్దయిన డికెటి భూముల రైతులకు సంబంధించి మాత్రం మాట తప్పాడు. మడమ తిప్పాడు. అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్ల పాటు తాము నిరీక్షించామని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు నెలల్లో అయినా ఇచ్చిన హామీ గురించి ఆలోచిస్తారా? లేక విస్మరిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.










