ప్రజాశక్తి-గుంటూరు : ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం గ్రామపంచాయతీల కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఏమైందో సమాధానం చెప్పాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతాజి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని వాగ్దానం చేశారని, పంచాయతీలోని పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే జీతంలో నాలుగో వంతు కూడా టెండర్, పార్ట్ టైం కార్మికులకు ఇవ్వట్లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడమంటే ఇదేనా అని ప్రశ్నించారు. చిన్న ఉద్యోగులందరికీ రూ.10 వేలకు తక్కువ లేకుండా జీతం చెల్లిస్తామని వాగ్దానం చేశారని, గ్రామ పంచాయతీ కార్మికులలో 70 శాతం మందికి రూ.10 వేలైనా జీతం రావట్లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించిన గ్రీన్ అంబాసిడర్లు అత్యధిక మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతేడాది వరకు వీరి జీతాలు కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి చెల్లించారని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో వీరి జీతాల చెల్లింపు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఇప్పటికే అత్యధిక పంచాయతీలలో కరెంటు బిల్లు సహా కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులలో కునారిల్లు తున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల్లేక ఇబ్బంది పడుతున్న పంచాయతీలపై గ్రీన్ అంబాసిడర్ల జీతాల భారం కూడా పడడంతో చాలా పంచాయితీలు చేతులెత్తేస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ఏళ్ల తరబడి అతి తక్కువ జీతంతో పనిచేసిన గ్రీన్ అంబాసిడర్లు పనులు కోల్పోయి వారి కుటుంబాలు వీధిన పడాల్సి వస్తుందన్నారు. గ్రామంలో పారిశుధ్య విధులు నిర్వర్తించే వారు లేక మురుగు పేరుకుపోయే వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉందన్నారు. గ్రీన్ అంబాసిడర్లందర్నీ కొనసాగించాలని వారికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా టెండర్, పార్ట్ టైం కార్మికుల రెన్యువల్ కోసం పంచాయతీల నుండి ఇంతవరకు ప్రతిపాదనలే అధికారులకు పంపలేదని, తక్షణమే కార్మికులందరికీ రెన్యువల్ ఆర్డర్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్.సురేష్ ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, బకాయి జీతాలు చెల్లించాలని, పిఎఫ్, యూనిఫారం, సబ్బులు, నూనెలు, గుర్తింపు కార్డులు తదితర సౌకర్యాలు అన్ని అమలు చేయాలని కోరారు. ధర్నా అనంతరం ప్రదర్శనగా డిపిఒ కార్యాలయానికి వెళ్లి సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందించారు. ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శులు బి.లక్ష్మణరావు, ఎన్.శివాజీ, యూనియన్ జిల్లా నాయకులు డి.వి.నరసింహారావు, ఇబ్రహీం, కార్మికులు పాల్గొన్నారు.










