Aug 07,2023 20:58

వీఆర్‌ఏల నిరాహార దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు

ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సిఐటియు
కలెక్టరేట్‌ ఎదుట విఆర్‌ఎల రెండ్రోజుల నిరాహార దీక్ష ప్రారంభం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి విఆర్‌ఎ(తలారి)లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు, జిల్లా కార్యదర్శి బి.బాల వెంకట్‌, విఆర్‌ఎల సంఘం జిల్లా కార్యదర్శి భూపాల్‌లు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి విఆర్‌ఎ(తలారి)లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎపి గ్రామరెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండ్రోజుల నిరాహార దీక్షలు సోమవారం కలెక్టరేట్‌ ముందు ప్రారంభమయ్యాయి. దీక్షలకు విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేష్‌ అధ్యక్షత వహించారు. దీక్షలను సిఐటియు జిల్లా కార్యదర్శి వి.బాలవెంకట్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేయాలని, నామినీలుగా పని చేస్తున్న వారందరినీ విఆర్‌ఎలుగా ఉంచాలన్నారు. అర్హత కలిగిన వారికి విఆర్వోలుగా, అటెండర్‌, వాచ్‌మెన్‌ ప్రమోషన్స్‌ ఇవ్వాలని, డిఏ రికవరీ వెంటనే నిలుపుదల చేయాలని, డిఏతో కూడిన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గత నాలుగు సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. సమస్యలను పరిష్కరించక పోతే చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా నాయకులు మహేష్‌, పాములపాడు, బేతంచెర్ల, ఆత్మకూరు, కొత్తపల్లి, నందికొట్కూరు, మిడుతూరు మండలాల అధ్యక్షులు పరమేశు, ఎస్కే భాష, శ్రీనివాసులు, సలాం, మహేశ్వరుడు, శివన్న, రమణ శీనుతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న విఆర్‌ఏలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.