
ప్రజాశక్తి - వన్‌టౌన్ : ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకూ ఇంద్రకీలాద్రిపై జరుగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే యాత్రికులు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డిప్యూటీ సిఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శ్రీ దేవినవరాత్రుల సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వారు నిర్వహించే దసర మహాోత్సవాల్లో శ్రీ కనక దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుర్గగుడి పరిసర ప్రాంతాలను పున్నమి ఘాట్, పార్కింగ్ ఏరియా, శానిటేషన్, క్యూలైన్, ఇతర వసతి ఏర్పాట్లను డిప్యూటీ సియం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో, వివిధ విభాగాల అధికారులతో కలిసి శనివారం పర్యవేక్షించారు. ఈ సంద ర్భంగా తగిన సూచనలను చేశారు. పక్క రాష్ట్రం నుండి వచ్చే వారికి కూడా అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, ఈఓ రామారావు , ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబా బు, పాలక మండలి సభ్యులు బుద్ధా రాంబా బు, కట్టా సత్తయ్య, కేసరి కష్ణా రెడ్డి పాల్గొన్నారు.