
వేసవి సెలవులు వస్తున్నాయంటే...పిల్లల్లో బోలెడంత సంతోషం వెల్లివిరుస్తుంది. ఏడాదంతా చదువుల సందడిలో గడిపేసిన పిల్లలకు వేసవి సెలవులు ఓ ఆటవిడుపు. గత రెండేళ్లుగా సెలవులను, పిల్లల ఆనందాలను కరోనా మింగేసింది. ఊళ్లల్లో తాతయ్య, బామ్మల ఒడిలో... వారి ముద్దు మురిపాల నడుమ గడపాల్సిన రోజులను కరోనా భయంతో గడపాల్సి వచ్చింది. 'స్వచ్ఛమైన నవ్వులు/ విచ్చుకున్న బంధాలు/ పెంచుకున్న అనుబంధాలు/ చిన్ననాటి జ్ఞాపకాలు' అని ఓ కవి చెబుతాడు. చిన్ననాడు స్నేహితులతో బంధువులతో గడిపిన క్షణాలు, అనుబంధాల తీయని జ్ఞాపకాలు జీవితమంతా పరిమళిస్తూనే వుంటాయి. పొలమరింపజేస్తూనే వుంటాయి. ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదగడానికి... తనను తాను మలచుకోవడానికి, విజ్ఞానాన్ని పోగు చేసుకోడానికి వేసవి సెలవులు ఎంతగానో ఉపకరిస్తాయి. చదవడం పట్ల ఆసక్తిని పెంచితే...వారిలో సృజనాత్మకత పెంపొందుతుంది. ఊరు, పొలాలు, తాతయ్య, బామ్మ, మామిడి తోపులు, స్నేహితులతో కేరింతలు, నవ్వులు, అలకలు, గొడవలు... ఇవన్నీ వేసవి తెచ్చే మధురమైన అనుభవాలు. పాలసముద్రం నుంచి అమృతం చిలికినట్టు... ఇలాంటి అందమైన అనుభవాల నుంచే మెదడు వికసిస్తుంది.
గత రెండేళ్లలో ఇళ్లకే పరిమితమైన పిల్లలను వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై వుంది. 'నా ప్రతి ప్రయాణం నాకు తెలియని ఒక గొప్ప ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది' అంటాడో రచయిత. వేసవి క్యాంపులు, ఆటపాటలతో పాటు విజ్ఞాన దాయకమైన ప్రయాణాలు కూడా వుండాలి. వేసవి సెలవుల్లో పిల్లలను సమ్మర్ క్లాసులకు పంపకపోతే తోట పని, వంట పని వంటి పనులు నేర్పించవచ్చు. తద్వారా మనం ఏం తింటున్నామో, అది ఎంత కష్టపడితే కంచం లోకి చేరుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. వంటగది అమ్మాయిలకే కాదు... అబ్బాయిలకూ అవసరమేననే విషయం చిన్నతనం నుంచే అలవడుతుంది. పుస్తక పఠనం, లైబ్రరీకి వెళ్లడంతోపాటు మ్యూజియంల సందర్శన కూడా ఒక భాగం చేసుకోవాలి. మ్యూజియంలు చరిత్రకు ఆనవాళ్లు. గత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తరాలకు అందించే విజ్ఞాన కేంద్రాలు. వీటి సందర్శన వల్ల పిల్లల్లో చరిత్ర, కళలు, సంస్కృతి పట్ల ఆసక్తి పెరుగుతుంది. తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలవుతుంది. మనిషి సాధించిన విజయాల తాలూకు చిహ్నాలను, భద్రపరచిన ఆనవాళ్లను ముందు తరాలకు పరిచయం చేయడానికి మ్యూజియంలు ఉపయోగపడతాయి. ఈ ఉద్దేశంతోనే ప్రతీ ఏడాది మే 18న 'అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం' జరుపుతుంటారు. కరోనా కారణంగా మ్యూజియంలు సైతం దర్శించడానికి గత రెండేళ్లుగా వీలు లేకుండా పోయింది. ఈసారి ఆ కొరత తీర్చుకునే అవకాశం వచ్చింది.
మారుతున్న జీవనశైలి కారణంగా తల్లిదండ్రులిద్దరూ బిజీ అయిపోతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో గమనించే పరిస్థితి వుండంలేదు. ఆన్‌లైన్ చదువుల నేపథ్యంలో పిల్లల చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. ఇవి వారికి ఎంత విజ్ఞానం అందిస్తున్నాయో పక్కన పెడితే...అనవసరమైన విషయాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి. వీడియో గేమ్స్, కొందరైతే పోర్న్ సైట్లకు బానిసలవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా గంటల తరబడి సోషల్ మీడియాలో గడుపుతూ.....దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా ప్రభావిత రెండేళ్ల కాలం పిల్లల మానసిక వికాసానికి పెద్ద అవరోధంగా మారింది. దీని నుంచి బయట పడాలంటే... ఈ ఏడాది వేసవి సెలవులను విజ్ఞానదాయకంగా, మానసిక వికాసానికి తోడ్పడేవిధంగా ప్లాన్ చేసుకోవాలి. కరోనా కాలంలో చోటుచేసుకున్న నిరాశ, నిస్పృహలు తొలగిపోయి... కోవిడ్‌కు ముందున్నప్పటి ఉత్సాహం మళ్లీ ప్రోదిచేసుకోవాలి. ఈ కాలంలో ఎక్కువ సమయం ఇంటికే పరిమితమైపోవడం, సోషల్ మీడియాకు, స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడిపోవడంతో పిల్లల్లో ఉత్సాహం తగ్గిపోయింది. అందుకే కచ్చితంగా ఈ వేసవి సెలవులు వారిలో పునరుత్తేజం నింపేలా ఉండాలి. రెండేళ్లలో కోల్పోయిన ఆనందానుభూతులను, జ్ఞాపకాల గుత్తులను... వేసవిలో విరబూసిన మల్లెల్ని మాలకట్టినట్లుగా గుదిగుచ్చి భద్రపర్చుకోవాలి. 'అద్భుతములు సృష్టి సేతురు అవనీ స్థలిలో!' అన్నట్లుగా ఒక్కో వేసవి మిగిల్చే ఒక్కో అనుభవం జీవిత వికాసానికి సోపానంగా మార్చుకోవాలి.