May 30,2021 07:55

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఎద్దేవా చేస్తూ హోదా తిరస్కరించి, విభజన హామీలను అమలు చేయని బిజెపి ని తప్పు పట్టకపోవడమేమిటి? ఈ అంశాలపై 2018 నుండి 2019 ఎన్నికల్లో సైతం తాము చేసిన విమర్శలు, విద్యార్థులతో సహా వివిధ తరగతులవారీ, ప్రాంతాలవారీ సమీకరణల్లో కేంద్రాన్ని ఆనాడు నిలదీసిన టిడిపి నేతలకు ఇప్పుడేమైందన్నది సామాన్యుల ప్రశ్న. హోదా సాధన విషయంలో వైసిపి, ముఖ్యమంత్రి ప్రయత్నాల్లో లోపాలను ప్రతిపక్షం తప్పక ఎండగట్టాల్సిందే. అయితే, అసలు దోషిని వదిలేసి ఇలా విమర్శలు చేస్తే వారి చిత్తశుద్ధిని ప్రజలు విశ్వసించరు.

   కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణా నినాదంతో భారత రాజకీయ యవనికపై కొంగొత్త చరిత్రను సృష్టించిన నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తన దిశను మార్చుకుంటోందా? తెలుగు ప్రజల హక్కులకోసం కేంద్రంపై తెగబడి పోరాడిన ఆ పార్టీయేనా ఇది? రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తిరస్కరించి, విభజన హామీలను అటకెక్కించిన బిజెపిని పల్లెత్తుమాట అనలేదెందుకు? కోవిడ్‌ మహమ్మారి కట్టడిలో మోడీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని అంతర్జాతీయ మీడియాతో సహా అందరూ ఘోషిస్తున్నా టిడిపి ఆ ఊసే ఎత్తలేదెందుకని? మోడీ సర్కారు తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు మొదట్లో మద్దతునిచ్చింది. కాని, వాటికి వ్యతిరేకంగా దేశమంతటా అన్నదాతలు ఆరు నెలలుగా ఆందోళనా పోరాటాలు సాగిస్తుంటే తన వైఖరిని పునరాలోచించుకోవాలని అనిపించలేదా? బిజెపి సాగిస్తున్న మత విద్వేష రాజకీయాలను, గో గూండాల అఘాయిత్యాలను సెక్యులర్‌ పార్టీగా చెప్పుకొనే టిడిపి ఖండించలేదు సరికదా కనీసం లౌకిక రాజ్యాంగ విలువలకు కట్టుబడి వ్యవహరిస్తానని మాటవరసకైనా అనలేదు. మే 27,28 తేదీల్లో జరిగిన మహానాడు తీర్మానాలు, నేతల ప్రసంగాలు పరిశీలించినవారికి ఇలాంటి పలు సందేహాలు కలుగుతాయి.
 

                                                 మోడీ సర్కారు వైఫల్యం కనపడదా ?

   మహానాడులో తొలిరోజు ''కోవిడ్‌ కట్టడిలో తీవ్ర వైఫల్యాలు-తలకిందులైన కుటుంబ ఆదాయం'' తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ప్రజల తక్షణ సమస్యపై శ్రద్ధకు నిదర్శనంగా భావించవచ్చు. 'పాజిటివ్‌ కేసులు, మరణాలు సహా ప్రతి విషయంలో తప్పుడు లెక్కలు చూపుతున్నారన్నారు. కరోనా తొలి రోజు నుండి కూడా ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ఆస్పత్రుల్లో వైద్యం అందించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా?' అని ప్రతిపక్షం ప్రశ్నించడం సబబే! తిరుపతి రుయా ఆసుపత్రితో సహా హిందూపురం, విజయనగరం తదితర ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత కారణంగా సంభవించిన మరణాలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలపవచ్చు. అయితే, కోవిడ్‌ మహమ్మారి అదుపునకు అవసరమైన చర్యలు చేపట్టకపోవడమేకాక ముందస్తు నోటీసు లేకుండా లాక్‌డౌన్‌తో దేశాన్ని అతలాకుతలం చేయడం మొదలు మందులు, ఆక్సిజన్‌, అత్యంత కీలకమైన వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీ వరకూ అన్నిటా విఫలమైన మోడీ సర్కారుపై ఒక్క విమర్శ కూడా లేకపోవడం దారుణం.
 

                                                        గురివింద చందం కాదా !

   రాష్ట్రంలో స్టేట్‌ టెర్రరిజం నడుస్తోందని, ప్రభుత్వ తప్పిదాలపై ఎవరు మాట్లాడితే వారి నోరు మూయించే ప్రయత్నం పోలీసులతో చేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రభుత్వ చర్యలను న్యాయస్థానాలు కూడా తప్పుపట్టాయని, కోర్టులను కూడా ప్రభుత్వం బెదిరిస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? రాష్ట్రంలో వాక్‌ స్వాతంత్య్రం ఉందా? అని ప్రశ్నించారు. అయితే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలపై ముఖ్యంగా ప్రజల సమస్యలను ఎలుగెత్తే వామపక్షాలపై సాగించిన నిర్బంధాన్ని మరిచినట్టున్నారు. అది టిడిపి లేక వైసిపి అధికారంలో ఏ పార్టీ వున్నా ప్రజాందోళనల విషయంలో పోలీసుల వైఖరి ఒకేలా వున్నమాట నిజం. ప్రస్తుత ప్రభుత్వ అప్రజాస్వామిక పోకడలను నిర్ద్వంద్వంగా ఖండించాల్సిందే. అయితే, గతంలో జరిగిన తప్పులపై ఆత్మవిమర్శ చేసుకుంటేనే నిజాయతీగా వుంటుంది.
 

                                                            అసలు దోషిని వదిలేసి.....

   ప్రత్యేక హోదాను ఎప్పుడు సాధిస్తారో జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని మరో తీర్మానంలో టిడిపి డిమాండ్‌ చేసింది. హోదా, విభజన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ చేసిన తీర్మానంలో కేసుల మాఫీ కోసం జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించింది. సి.ఎం తో పాటు వైసిపి ఎంపీలు రాజీనామా చేయాలని కూడా టిడిపి నేతలు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఎద్దేవా చేస్తూ హోదా తిరస్కరించి, విభజన హామీలను అమలు చేయని బిజెపి ని తప్పు పట్టకపోవడమేమిటి? ఈ అంశాలపై 2018 నుండి 2019 ఎన్నికల్లో సైతం తాము చేసిన విమర్శలు, విద్యార్థులతో సహా వివిధ తరగతులవారీ, ప్రాంతాలవారీ సమీకరణల్లో కేంద్రాన్ని ఆనాడు నిలదీసిన టిడిపి నేతలకు ఇప్పుడేమైందన్నది సామాన్యుల ప్రశ్న. హోదా సాధన విషయంలో వైసిపి, ముఖ్యమంత్రి ప్రయత్నాల్లో లోపాలను ప్రతిపక్షం తప్పక ఎండగట్టాల్సిందే. అయితే, అసలు దోషిని వదిలేసి ఇలా విమర్శలు చేస్తే వారి చిత్తశుద్ధిని ప్రజలు విశ్వసించరు.
 

                                                          కేంద్రానికి మోకరిల్లుతారా !

   కేేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతునివ్వాలని, జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తున్న వారిని కలుపుకొని పోరాటం సాగించాలని రాజకీయ తీర్మానాన్ని టిడిపి ఆమోదించింది. బ్యూరోక్రసీ, పోలీసులు పొలిటికల్‌ గేమ్‌లో ఇన్వాల్వ్‌ అయ్యారని, రాజ్యాంగాన్ని జగన్‌ కాలరాస్తున్నారని నేతలు విమర్శించారు. అధికారం, ధనార్జనే ప్రాధాన్యతగా పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఒక విపక్ష పార్టీగా టిడిపి వైఖరిని అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగు ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణా నినాదంతో కేంద్ర ప్రభుత్వంపై ఎదురొడ్డి పోరాడిన చరిత్రగల పార్టీ ఇలా కేంద్రానికి మోకరిల్లడమేమిటా అన్నది పలువురి సందేహం. నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని అప్పటి కాంగ్రెస్‌ యువనేత అవమానిస్తే దానిపై ఎన్‌టిఆర్‌ ఎదురు తిరిగారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు కిమ్మనకున్నా రామారావు తెలుగు పౌరుషాన్ని ఎలుగెత్తి చాటారు. ప్రధాని కేంద్ర నిరంకుశ విధానాలకు, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో దేశంలోని వివిధ ప్రతిపక్ష పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకురావడంలో ఎన్‌టి రామారావు పాత్ర అజరామరమైనది. అలాంటి చరిత్రగలిగిన పార్టీ ఇలా ఎందుకు చేస్తోందో !
 

                                                     'విశాఖ ఉక్కు'ను మరిచారా ?

   ''నత్తనడకలో సాగునీటి ప్రాజెక్టులు- కుదేలైన వ్యవసాయం'', తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం-సమస్యల సుడిలో అన్నదాత'', 'కొరవడిన మహిళా వికాసం', 'ఉపాధి హామీ పధకం నిర్వీర్యం-బిల్లుల పెండింగ్‌', ''పరిశ్రమలపై దాడులు-అమరావతి సంపద విధ్వంసం-పెరుగుతున్న నిరుద్యోగం'', ''అదుపులేని ధరలు-పెంచిన పన్నులు-అప్పులు'' వగైరా 17 తీర్మానాలను మహానాడు ఆమోదించింది. అయితే దేశమంతటా ఆందోళనగా వున్న నల్ల వ్యవసాయ చట్టాలు, కార్మిక చట్టాలను కాలరాసి కోడ్‌లుగా మార్చిన మోడీ సర్కారు దారుణాల గురించి ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యకరం. అన్నిటికీ మించి 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అని తెలుగువారు పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామన్న నరేంద్ర మోడీ సర్కారు తీరును ఎండగట్టకపోవడం దారుణం. ఈ అంశంపైనే ఒక ప్రత్యేక తీర్మానం చేసివుండాలి. అది కూడా మరిచారా....?
    మొత్తమ్మీద మహానాడు సమావేశాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన, వారి పాలనపైన ఎక్కుపెట్టి ఈ రెండు రాష్ట్రాలకూ తీరని అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని సమర్ధించడం ద్వారా టిడిపి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైనట్టు భావించవలసి వస్తోంది.
 

బి. తులసీదాస్‌