Apr 11,2021 07:07

   త్తు, పొడవు, వెడల్పుల్లాగే కాలం కూడా ఒక కొలమానం. పొడవు, వెడల్పు, ఎత్తు విషయంలో మనం ముందుకు, వెనక్కూ ఎటైనా వెళ్లొచ్చు. కానీ, కాలం విషయంలో అది సాధ్యం కాదు. ''ఆదిత్య 369' సినిమాలో మాదిరిగా కాలయంత్రంలో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లడం, ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి వెళ్లి, ఎప్పుడో జరగబోయే అణుయుద్ధాన్ని ముందే చూసేసి, కలుషితమైన వాతావరణంతో అనేక ఇబ్బందులు పడి, వర్తమానంలోనికి రావడం' వంటివి వాస్తవ ప్రపంచంలో సాధ్యం కాదు. కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది. వెనక్కి, పక్కకి వెళ్లడమంటూ ఉండదు. కాలం అనే కొలబద్దతో పోల్చకుండా ఏ విషయాన్నీ అర్థం చేసుకోలేం. ఫలానా వయస్సులో పాఠశాలకు పంపాలి. ఫలానా వయస్సులో పెళ్లి చెయ్యాలి, వర్షం ఎప్పుడొస్తుంది. ఎండలు ఏ సమయంలో వస్తాయి వంటి పరిణామాలను అర్థం చేసుకోడానికి కాలం అనే కొలమానంపైనే మనిషి ఆధారపడ్డాడు. పగలు, రాత్రి, చీకటి, వెన్నెల, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు తెలుసుకోడానికి... సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరిగే క్రమాన్ని ప్రామాణికంగా తీసుకున్నాం. అలాగే... కాలం అనేది ప్రకృతి గమనాన్ని అర్థం చేసుకోడానికి మనకు మనమే రూపొందించుకున్న కొలమానం.
   అలాంటి కొలమానంలో మరో సంవత్సరం గడిచింది. 'గతమంతా తడిసె రక్తమున.. కాకుంటే కన్నీళులతో' అన్నాడు మహాకవి శ్రీశ్రీ. గత ఉగాది కరోనాతో మొదలైంది. మళ్లీ ఈ ఉగాదికి కరోనా రెండవ దశ తిరిగి ఊపందుకుంది. కాలం పరుగెడుతూనే వుంది. కరోనా వ్యాధి సోకినవారి సంఖ్య గతేడాదికంటే ఎక్కువగా పెరుగుతూనే వుంది. కానీ, గడచిన కాలాన్ని, పోయిన ప్రాణాలను, పడిన వేదనను మాత్రం తిరిగి తీసుకురాలేం. ముందు కాలానికీ వెళ్లలేం. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసింది స్వల్పమే. కరోనా వ్యాక్సిన్‌తో ప్రజల నమ్మకాన్ని గెలవలేకపోయింది. దేశంలో సరిపోయినంత వ్యాక్సిన్‌ సరఫరా లేదు. తగిన మోతాదులో లభ్యం కావడంలేదని కరోనా బాధిత రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. గత కాలమంతా వలసలు, నిరుద్యోగం, ఆకలీ, కన్నీళ్లతోనే గడిస్తే... మళ్లీ ఈ ఏడాది కూడా అదే పునరావృతం అవుతోంది. మళ్లీ ఉగాదితో మొదలైంది. వలసలు, లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు ప్రారంభమయ్యాయి. గతేడాది భయాలు... అనుభవాలు నత్త నెత్తిమీది గూడులా వెన్నంటే వున్నాయి. మరి... ఏం చూసి ఈ ఉగాది పండుగ జరుపుకోవాలి? మనిషికి భవిష్యత్‌పై ఆశ వుంటుంది. భవిష్యత్‌లో అద్భుతాలు జరగకపోయినా... మంచిరోజులైతే వస్తాయని ఆశించడం సహజం. అలాగని మానవ ప్రయత్నం మానుకుంటే... బతుకు అంధకారం అవుతుంది. 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని/ ఎదురు చూసి మోసపోకుమా/ నిజం మరచి నిదురపోకుమా' అంటాడు శ్రీశ్రీ. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడకుండా... మన ప్రయత్నం మనం చెయ్యాలి. లేకుంటే... మనం సృష్టించుకున్న సమాజం మన చుట్టూ వుంటుంది తప్ప, మన బతుకులింకా దిగజారిపోతాయి.
   గత కరోనా కాలంలో రెట్టింపు కోటీశ్వరులైన వాళ్లు, ఐదారు రెట్లు ఆస్తులు పెంచుకున్నవారికి నిజంగానే మంచి రోజులొచ్చాయి. ఈ కరోనా కాలంలోనూ ప్రభుత్వం వారికి అండగానే వుంది. అందుకే వారు సంబరపడుతున్నారు. అధికారపక్షం పంచాంగం, ప్రతిపక్షం పంచాంగం వాళ్లకి కావాల్సినట్లే వుంటుంది. కానీ, ప్రజల పంచాంగం మాత్రం ఎప్పుడూ ఒకేలా వుంటుంది... ఏ మార్పూ లేకుండా. మంచిరోజులొస్తాయని, ఎవరో తెస్తారని మనం మిన్నకుంటే మంచిరోజులు రావు. గతేడాది శార్వారి నామ సంవత్సరం చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. కొత్తగా వస్తోన్న 'ప్లవ నామ సంవత్సరం'... గతం కంటే ఎక్కువ కరోనా కేసులను మోసుకొచ్చింది. అయినా, మనిషి ఆశాజీవి. గతేడాది ఏం సాధించామో ఒకసారి నెమరువేసుకుంటాం. భవిష్యత్‌లోనైనా మంచిరోజులు రావాలని కోరుకుంటాం. కార్పొరేట్లకెలాగూ మంచిరోజులొస్తాయి. ఎందుకంటే, వాళ్ల ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వాలే వున్నాయి గనుక. కానీ, పేదలకు మంచిరోజులు రావాలంటే... మనలనెవరో ఉద్ధరిస్తారని ఊరుకోకుండా ఒకరికొకరు తోడు నిలిచి ఐక్యంగా కదలాలి. సమిష్టి కృషితోనే పరిస్థితుల్ని, వ్యవస్థనూ మార్చుకోవడం సాధ్యం. దానికి ఒక ప్రారంభం కావాలి. ఆ ప్రారంభానికి, ఓ సరికొత్త ఆలోచనకు ఈ ఉగాది రోజున నాంది పలకాలి.