కడప అర్బన్ : స్వాతంత్య్ర సమరయోధులు, భారత తొలి విద్యాశాఖ మంత్రి 'మౌలానా అబుల్ కలాం ఆజాద్' అసమాన విద్యావేత్తతో పాటు గొప్ప పరిపాలకుడని, ఈ తరం యువతకు ఆదర్శనీయుడని కలెక్టర్ వి.విజరు రామరాజు అన్నారు. శనివారం కలెక్టరెట్‌లోని స్పందన హాలులో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ వి.విజరు రామరాజు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీ, నెహ్రూలతో చురుగ్గా మౌలానా అబుల్ కలాం పాల్గొన్నారని తెలిపారు. అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఆయన నిష్ఠానితులని పేర్కొన్నారు. భారత విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టి నందుకు గాను మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియమితులైనారు అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని, ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను మంచి ఆశయాలతో పెంచాలన్నారు. పిల్లలే రేపటి తరం భవిష్యత్తని.. అందరూ బాగా చదువుకోవాలని, గొప్పవారు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి షేక్, ఇమ్రాన్, జిల్లా మైనార్టి కార్పొరేషన్ ఇడి సంక్షేమ శాఖ అధికారి బ్రహ్మయ్య, కార్పొరేటర్లు షఫీ, అజ్మతుల్లా, ఆరిఫుల్లా, ఇతర కార్పొరేటర్లు, వైసిపి నాయకులు ఆఫ్జల్ ఖాన్, జిల్లా వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ దస్తగిరి, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ రీజ్వాన్,మైనార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాలలో..
కడప : జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పురుషుల కళాశాలలో శనివారం ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జి. రవీంద్రనాథ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పి. శివరామకష్ణ, డాక్టర్ అంకాల నాగరాజు, ఉర్దూ అధ్యాపకులు వసీవుల్లా భక్తి యారి, రాజశేఖర్ రెడ్డి, గయాస్, విద్యార్థులు పాల్గొన్నారు.