May 22,2023 19:22

రోడ్డు మరమ్మతులు చేపట్టాలని నిరసన తెలుపుతున్న యువకులు

ప్రజాశక్తి - హోళగుంద
ఇక ఈ రోడ్లు ఇంతేనా, రోడ్లు బాగా లేవని ఎపిఎస్‌ఆర్‌టిసి రూటు మార్చినా పాలకులు పట్టించుకోరా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చరా అంటూ మండల ప్రజలు మండిపడుతున్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామం మార్లమడికి, ఢణాపురం నుంచి హోళగుంద రోడ్డు దుస్థితి వర్ణణాతీతంగా ఉంది. కర్ణాటక సరిహద్దులోకి అడుగు పెట్టడానికి 5 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ రోడ్లన్నీ గుంతలమయమై ఉండడంతో ఎక్కడికి వెళ్లాలన్నా సమయం వృథా అవుతోంది. నానా ఇబ్బందులు పడి గమ్యస్థానానికి చేరుకొని హమ్మయ్య గండం నుంచి గట్టెక్కామని, ఇక బయటపడ్డామని అనిపిస్తుందని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. మార్లమడికి రోడ్డులో ఎల్లార్తి దర్గాకు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో కర్ణాటక రాష్ట్రం నుంచి ఇదే మార్గంలో చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. మార్లమడికి రోడ్డు భూమి పూజ కే పరిమితమయింది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత మార్లమడికి రోడ్డుకు నిధులు కేటాయించామని, రూ.2.60 కోట్లు మంజూరయ్యాయని సంబంధిత శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. ఇంతవరకూ నిర్మాణ పనులకు నోచుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంత్రి శంకుస్థాపన చేశారని, ఇక రోడ్డు పనులు పూర్తవుతాయని మండల ప్రజలు భావించారు. భూమి పూజ చేసి రెండేళ్లయినా పనులు మొదలు పెట్టకపోవడంతో మండల ప్రజలు మండిపడుతున్నారు. హోళగుంద నుంచి ఢణాపురం రోడ్డు కోసం రూ.69 కోట్లు మంజూరు చేశారు. గుత్తేదారులతోపాటు ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి సోదరులు నారాయణస్వామి, శ్రీనివాసులు భూమి పూజ చేశారు. పనులు ప్రారంభమవుతాయో లేదోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు సార్లు కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టడానికి వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు పర్సెంటేజ్‌ అడగడంతో సందిగ్ధంలో పడ్డారు. వారికి పర్సెంటేజీలు ఇవ్వాలా.., నాణ్యతగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలా అని వెనక్కి తిరిగి వెళ్లినట్లు తెలిసింది. హోళగుంద మండలానికి చేరుకోవాలంటే ఏ రోడ్డులో చూసినా గుంతలు ఉండడంతో గర్భిణులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బళ్లారి, కర్నూలు వంటి జిల్లా కేంద్రాలకు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు బాగాలేదని రూటు మార్చిన ఆర్‌టిసి
ఢణాపురం టూ హోళగుంద రోడ్డు ఎటు చూసినా గుంతలు ఏర్పడి అధ్వానంగా ఉంది. ఈ రోడ్డులో ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు తిప్పడం వల్ల గత నాలుగేళ్లుగా ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువయ్యాయని, రోజూ బస్సు ఏదో ఒక మరమ్మతుకు గురికావడంతో భరించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. డ్రైవర్లు ఈ రోడ్డులో బస్సు నడపడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని బహిరంగంగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి రావడానికి పాలకులు కారణం కాదా అని మండల ప్రజలు, ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి గుత్తేదారులతో చర్చలు జరిపి రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.