జిల్లాలో రోడ్లు గజానికొక గొయ్యితో దర్శనమిస్తున్నాయి. ఈ రోడ్లు మీదుగా ప్రయాణించాలంటే వాహన చోదకులు, ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రోడ్లపై నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకున్న పాపా లేదు. దీంతో ప్రయాణికులకు, రోగులకు అవస్థలు తప్పడం లేదు.
ప్రజాశక్తి -భామిని: మండలంలోని బత్తిలి -అలికాం ప్రధాన రహదారి గోతుల మాయంగా మారి వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి. నెల రోజుల క్రితం పెద్దదిమిలి సమీపంలో బగ్గమర్రిపాడు గెడ్డ వంతెన ప్రమాదకరంగా బీటలు వారింది. దీనికి తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. కానీ అది ఏ రోజు కూలుతుందో తెలీని పరిస్థితి. సింగిడి నుంచి బిల్లుమడ మధ్య రోడ్డు పూర్తిగా గోతుల మాయంగా మారి ప్రయాణించడానికి కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి. వారం రోజులు క్రితం బిల్లుమడ -గురండి గ్రామాల మధ్య ప్రధాన రహదారి పూర్తిగా గొయ్యిపడి, వాహనాల రాకపోకలు సుమారు 3 గంటల పాటు నిలిచిపోయాయి. బత్తిలి -అలికాం ప్రధాన రహదారిపై బిల్లుమడ వద్ద ఉన్న వంతెనకు వేసిన కాంక్రీట్ గజాలు బయటి రావడంతో వాహనదారులు బిక్కు బిక్కు మంటూ నడపాల్సిన పరిస్థితి. ఒడిశా వాసులు నిత్యం వేల సంఖ్యలో బత్తిలి -అలికం రహదారి మీదుగా వైజాగ్, శ్రీకాకుళం పట్టణాలకు వైద్యం, వ్యాపార నిమిత్తం వెళ్తుంటారు. ఇటీవల అటుగా వెళ్తున్న ఎం పి పి ప్రతినిధి తోట సింహాచలం బిల్లుమడ వంతెనపై బయటకు వచ్చిన కాంక్రీట్ ఐరన్ నిర్మాణాలు పరిశీలించి ఆర్ అండ్ బి అధికారులకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రధానంగా ఒడిశా నుంచి నిత్యం వందల సంఖ్యలో భారీలోడుతో వచ్చే ఇసుక లారీల వల్ల రోడ్డు, వంతెనలు ప్రమాదకరంగా మారాయి. ఒడిశా నుంచి ఇసుక రవాణా ఆపే పరిస్థితి లేదని, ఇలా పూర్తి స్థాయి మరమ్మతులు లేకుండా కొనసాగితే రోడ్డుపై వెళ్లే పరిస్థితి లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి హెవీలోడ్‌తో వచ్చే ఒడిశా ఇసుక లారీలను నిలిపివేసి పూర్తి స్థాయిలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
సీతంపేట : మండలంలో కుసిమి జంక్షన్ నుండి ముత్యాలు వరకు రహదారి పూర్తిగా మరమ్మతులకు గురైందని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని టిడిపి ఎస్‌టి సెల్ రాష్ట్ర కార్యదర్శి బి.చందర్రావు తెలిపారు. సిలగాం నుంచి ముత్యాలు జంక్షన్ వరకు రోడ్డు గోతులు కావడంతో చెరువులు మాదిరిగా తయారైందని, దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి మార్గాన అనేక గ్రామాలు ఉన్నాయన్నారు. కుసిమి సంతకు కూడా అనేకమంది గిరిజనులు, వ్యాపారాలు వస్తుంటారని రద్దీగా ఉంటుందని అన్నారు. ఈ రహదారి మీదుగా రోగులను పాలకొండ , సీతంపేట గాని తరలించాలంటే కష్టమవుతుందని తెలిపారు. వెంటనే ఈ రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.










