Sep 22,2020 07:46

ఈ సంవత్సరర (2020-2021) మొదటి మూడు నెలల కాలానికి మన ఆర్థిక వ్యవస్థ 24 శాతం పతనం అయింది. కొట్టవచ్చినట్టు కనిపించే అంశం ఏమంటే గతేడాది ఇదే మూడు నెలల కాలంతో పోల్చితే పాలనా నిర్వహణ, రక్షణ, ప్రజాసేవలు-ఈ రంగాలలో వృద్థి 10.3 శాతం తగ్గిపోయింది! ఈ రంగాలకు సంబంధించి సాధించిన ఫలితాలను బట్టి గాక, ప్రభుత్వం చేసిన వ్యయం బట్టే వృద్ధిరేటును లెక్క కడతారు. అంటే, ఈ రంగాలలో ప్రభుత్వం చేసిన వ్యయం తగ్గిపోయిందన్నమాట. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఆర్థిక వ్యవస్థ ముడుచుకుపోయే పరిస్థితులు ఏర్పడుతూంటే దానిని నివారించేందుకు, ఆర్థిక వ్యవస్థ కోలుకునే దిశగా ప్రభుత్వ విధానం ఉండాలి. కాని ప్రభుత్వమే ఆర్థిక వ్యవస్థ మరింత ముడుచుకు పోయేందుకు దోహదం చేయడమేమిటి? పైగా, కరోనా మహమ్మారి విజృంభించి, లాక్‌డౌన్‌ కూడా విధించినందువల్ల ప్రభుత్వం వైద్యంపై చేసే ఖర్చు గతం కన్నా పెరుగుతుందని, దాని పర్యవసానంగా మొత్తం ప్రభుత్వ వ్యయం కూడా పెరుగుతుందని ఎవరైనా ఆశిస్తారు. కాని దానికి భిన్నంగా ప్రభుత్వ వ్యయం తగ్గిపోవడాన్ని మనం చూస్తున్నాం.
లాక్‌డౌన్‌ విధించాక, ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుచేత ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచవలసిన అగత్యం ఉన్నది. ఈ ప్రభుత్వ వ్యయం ఎంతగా పెరిగితే అంతమేరకు ఆర్థిక వ్యవస్థ ముడుచుకుపోవడాన్ని అది తగ్గించగలుగుతుంది. అంతేగాక, ప్రజల కొనుగోలుశక్తిని అది ఆ మేరకు పెంచుతుంది. దాని వలన వారి వినిమయం తగ్గకుండా ఉండడం గాక వారు అప్పుల పాలవకుండా నివారిస్తుంది. ఒకవేళ ఈ ప్రభుత్వానికి తన వ్యయాన్ని పెంచేంత ధైర్యం లేకపోయినట్లైతే, కనీసం గతేడాది చేసిన వ్యయం స్థాయికి తగ్గకుండా అయినా కనీసం కొన సాగించవచ్చు. కాని అది కూడా చేయకుండా ఈ లాక్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేసి ఆర్థిక వ్యవస్థ మరింత ముడుచుకుపోయేలా చేయడమనేది ఒక ప్రభుత్వం చేయకూడని పని.
'మరి ఈ కాలంలో ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గింది కదా' అన్న వాదన ఉంది. ఆదాయం తగ్గింది కనుక, ద్రవ్యలోటు పెరగకూడదనే నెపంతో... ఇటువంటి సమయంలో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం తప్పుల్లోకెల్లా పెద్ద తప్పు. దీని వలన ఆర్థిక వ్యవస్థ ముడుచుకుపోయే క్రమం మరింత తీవ్రమై, తత్ఫలితంగా ప్రజల ఇక్కట్లు మరింత పెరుగుతాయి. మోడీ ప్రభుత్వం ప్రజలకు ఈ కాలంలో చేసిన ఉపకారం ఇదే.
ఈ తప్పు ఇక్కడితో ఆగలేదు. మోడీ ప్రభుత్వం ఇంకా ఆ తప్పునే కొనసాగించే పనిలో ఉన్నది. ఈ ఆరోపణ చేయడం అన్యాయమని, పార్లమెంటు సమావేశాల తొలిరోజునే ఆర్థిక మంత్రి రూ.2.35 లక్షల కోట్ల సప్లిమెంటరీ గ్రాంట్ల కోసం ప్రతిపాదన చేసిందని, అంటే ఆ మేరకు అదనపు ఖర్చు చేయడానికి సన్నద్ధమౌతున్నదని కొందరు వాదించవచ్చు. కాని ఈ అభిప్రాయం తప్పు. ఈ సప్లిమెంటరీ గ్రాంట్లు కోరింది రాబోయే కాలంలో అదనంగా ఖర్చు చేయడానికి కాదు. కరోనా కాలంలో బడ్జెటరీ ఆమోదం లేని పద్దుల కింద ఇప్పటికే ప్రభుత్వం చేసేసిన ఖర్చుకు ఆమోదం పొందడం కోసం. ఈ అదనపు ఖర్చు ఇంతకు ముందే చెప్పినట్టు చాలా స్వల్పం. మన జిడిపి లో ఒక శాతం కూడా లేదు. ఈ ఖర్చు వలన నిధుల లేమితో కునారిల్లుతున్న ఉపాధి హామీ పథకానికి కొంత ఊరట వచ్చి వుండవచ్చు. కాని ఇంతకు ముందే ఉపాధికి ఇచ్చిన హామీని నెరవేర్చడానికి అది ఉపయోగపడుతుంది తప్ప కొత్తగా ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు తోడ్పడదు.
మన దేశంలో సహాయం నిమిత్తం జిడిపి లో కేటాయించినది ఒక్క శాతం మాత్రమే, ప్రపంచం లోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే ఇది అన్నింటికన్నా కనిష్ఠం. అమెరికాలో 10 శాతం, జర్మనీలో 5 శాతం, జపాన్‌ లో అంతకన్నా ఎక్కువే సహాయం కింద అదనంగా కేటాయించారు. పిసినారితనంలో మోడీ అందరినీ మించిపోయారు. పుష్కలంగా ఆహార ధాన్యాల నిల్వలున్నా, దేశంలో నలుమూలల నుండీ ఆకలిచావుల వార్తలు వినవస్తూనే వున్నాయి. అయినా వాటిని పట్టించుకోకపోవడం ఏమనాలి?
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికవేత్తలందరూ, వారి సైద్ధాంతిక విభేదాలతో నిమిత్తం లేకుండా అంగీకరించే విషయం ఒక్కటే. మరింత ఎక్కువగా ప్రభుత్వ వ్యయం జరగాలి (ఇదే మాదిరిగా గతంలోనూ ఆర్థికవేత్తలందరూ 'నోట్ల రద్దు ఒక పనికిమాలిన చర్య' అని చెప్పారు. అది బొత్తిగా అనాలోచిత వ్యవహారం. అయినా అదేమీ ఒక విధాన నిర్దేశం కాదనుకోండి).
ఇప్పుడు ఆర్థికవేత్తల నడుమ విభేదాలున్నది రెండు అంశాల విషయంలో. మొదటిది-ఏయే రంగాలలో ప్రభుత్వం అదనపు వ్యయానికి పూనుకోవాలి? రెండవది- ఈ అదనపు వ్యయాన్ని చేపట్టడానికి ఆర్థిక వనరులను ఏ విధంగా సమీకరించాలి?
మొదటి ప్రశ్నకు వామపక్షవాదులు చెప్పే సమాధానం- ఆదాయం పన్ను పరిధి లోకి రాని ప్రతీ కుటుంబానికీ నేరుగా నగదు చెల్లించాలి. దానితోబాటు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం, మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేయాలి. ఇదే ప్రశ్నకు సాంప్రదాయ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు చెప్పే సమాధానం- యంత్రాలు, భవనాలు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి.
ఇక అదనపు ఆర్థిక వనరుల సమీకరణకు సంబంధించి వామపక్షవాదులు చెప్పేది- ముందు ద్రవ్యలోటు పెంచడం ద్వారా అదనపు వనరులు సేకరించాలి. అంటే రిజర్వుబ్యాంకు నుండి ప్రధానంగా రుణం తీసుకోవాలి. బడ్జెట్‌లో కేటాయించిన దానికన్నా అదనంగా కనీసం రూ.10 లక్షల కోట్ల మేరకు కేంద్రం ఖర్చు చేయాలని, అందుకోసం ద్రవ్యలోటును ప్రస్తుతం ఉన్న 3.5 నుంచి 9 శాతానికి పెంచాలని చాలామంది చెప్తున్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం మొదలుబెట్టాక ద్రవ్యలోటును తగ్గించుకోవాల్సి వుంటుంది. అందుకోసమే వామపక్షాలు సంపద పన్ను విధించాలని ప్రతిపాదించాయి. కాని సాంప్రదాయ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు మాత్రం ప్రభుత్వరంగ సంస్థల ఆస్థులను, భూములను అమ్మి తద్వారా అదనపు వనరులను సేకరించాలని చెప్తున్నాయి.
ఈ రెండు దృక్పథాల మధ్య మౌలికంగానే తేడా ఉంది. దీనిని మనం స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. ద్రవ్యలోటు పెరగడం అంటే ప్రభుత్వం అప్పు పెరగడం. ఈ అదనపు అప్పుతో ప్రభుత్వం చేపట్టే ఖర్చు వలన అంతిమంగా సంపద పెట్టుబడిదారుల వద్దే చేరుతుంది (ఉదాహరణకు- ప్రజా వైద్యం పై ఖర్చు పెరిగితే ఫార్మా కంపెనీలకు, మెడికల్‌ కిట్లు తయారు చేసే కంపెనీలకు, శానిటైజర్లు తయారు చేసే కంపెనీలకు అదనంగా లాభాలు చేకూరుతాయి-అను). ప్రభుత్వం ఈ ఖర్చు కోసం చేసే రుణాలు మార్కెట్‌లో బాండ్ల విడుదల ద్వారా సేకరిస్తారు గనక ఆ బాండ్లను కొనుగోలు చేసే ప్రైవేటు రంగం వడ్డీల రూపంలో కూడా అదనంగా సంపదను చేజిక్కించుకుంటుంది. మొత్తంమీద ప్రైవేటు రంగం దగ్గర ఉండే సంపద పెరుగుతుంది. సంపదలో అసమానతలు పెరుగుతాయి. ఈ అసమానతలను తిరిగి పాత స్థాయికి (అంటే ద్రవ్యలోటును పెంచక మునుపు ఉన్న స్థాయికి) తేవాలంటే సంపద పన్ను విధించడం ఉత్తమమైన మార్గం. ఈ సంపద పన్ను వలన సమాజంలో ఉన్న సంపద అసమానతలను తగ్గించడం అంటూ ఏమీ జరగదుగా అసమానతలు మరింత పెరిగిపోకుండా నిరోధిస్తుంది. అంతే. అందుచేత వామపక్షవాదుల ప్రతిపాదనలు ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి, అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోకుండా ఉండడానికి తోడ్పడతాయి..
డా||రఘురాం రాజన్‌ వంటి సాంప్రదాయ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు చెప్తున్నది దీనికి భిన్నంగా ఉంది. ఆయన ప్రతిపాదనలు పెరిగే ద్రవ్యలోటు వలన మరింత పెరగనున్న ఆర్థిక అసమానతలను తగ్గించవు. వారి చేతుల్లో ప్రభుత్వ బాండ్లు ఉండే బదులు విలువైన ప్రభుత్వ భూములను గాని, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్థులను గాని ఉంచుతాయి. అంటే ఆ సంపన్నుల వద్ద ఉండే సంపద రూపాన్ని మార్చుతాయే తప్ప, వారి వద్ద మరింత సంపద పేరుకుపోకుండా నిరోధించవు.
ఈ తేడాలున్నప్పటికీ, ప్రభుత్వ వ్యయాన్ని మరింతగా పెంచవలసిన అవసరం ఉందని, అలా పెంచితేనే ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలపు మాంద్యం లోకి జారిపోకుండా నిలవరించగలమని అన్ని తరహాల ఆర్థికవేత్తలూ ఉమ్మడి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. కాని ఏ కారణంచేతనోగాని ప్రభుత్వం మాత్రం ఇందుకు అనుగుణంగా స్పందించడం లేదు. ప్రభుత్వంలో ఉన్న బ్యూరోక్రాట్లందరూ పరిస్థితి తీవ్రతను గుర్తించి దానికి తగినట్టు స్పందించాలని వారికి రఘురాం రాజన్‌ విజ్ఞప్తి చేశారు. కాని మోడీ హయాంలో విధానాలను రూపొందించడంలో ఈ బ్యూరోక్రాట్లకు ఎటువంటి పాత్రా లేదు. ఆర్థిక విధానాలతో సహా అన్ని విధానపరమైన నిర్ణయాలనూ మోడీ, ఆయన చుట్టూ ఉండే కొద్దిపాటి బృందం తీసుకుంటారు. ప్రభుత్వం పొంచి వున్న ఆర్థిక వినాశనాన్ని పట్టించుకోకుండా బేఖాతరుగా వ్యవహరిస్తోంది. దాదాపు 5 కోట్ల ఉద్యోగాలను కోల్పోయే దారుణ పరిస్థితికి ఈ సంక్షోభం దారితీయనున్నదని కొందరి అంచనా. మరి ఇంత ప్రమాదం దాపురిస్తున్నా పట్టించుకోవడం లేదంటే మనం మోడీ మైండ్‌సెట్‌ ఏ తీరుగా ఉందో పరిశీలించాల్సిందే. అలా పరిశీలిస్తే అక్కడ మనకి ఒకవైపు అత్యున్నత స్థాయిలో తెలివితక్కువతనమూ ఇంకోవైపు అత్యంత ఆత్మవిశ్వాసమూ కానవస్తాయి.
కాలం చెల్లిన, అర్ధంలేని బూర్జువా ఆర్థిక సిద్ధాంతాలను తలకెక్కించుకున్నందు వల్లనే ఈ తెలివితక్కువతనం దాపురించింది. మోడీ బడా పెట్టుబడి దారులగురించి చెప్పేటప్పుడు 'సంపద సృష్టికర్తలు' అంటూ పదే పదే అంటూంటారు. ఈ సంపద సృష్టికర్తలు ఇప్పుడో, త్వరలో మరో రోజునో ఈ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారని ఆయన తలకెక్కించుకున్న ఆర్థిక సిద్ధాంతం చెప్పింది. దానిని ఆయన పూర్తిగా విశ్వసిస్తున్నాడు. ఆ సిద్ధాంతం ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభాలు అంటూ ఏవీ ఉండవు. ఒకవేళ ఆర్థికంగా జరగాల్సిన అభివృద్థి తాలూకు వేగం గనుక తగ్గితే ఈ 'సంపద సృష్టికర్తలు' రంగం లోకి దిగి మరో కొత్త ఊపును తీసుకొస్తారని ఆ సిద్ధాంతం చెప్తుంది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో సంభవించిన మహా మాంద్యం దాదాపు ఒక దశాబ్దం పాటు కొనసాగిందని, రెండో ప్రపంచ యుద్ధం రావడంతో దాని నుంచి గట్టెక్కగలిగారని ఈ సిద్ధాంతం గుర్తించదు. మార్కెట్‌లో డిమాండ్‌ ఎంత పెరిగితే అంతమేరకు పెట్టుబడులు పెరుగుతాయన్న సూత్రం వీరి తలకెక్కదు.
ప్రజలలో పేదరికం ఎంత పెరిగినా, వారెదుర్కొనే కష్టాలు ఎంత తీవ్రమౌతున్నా, తాము ముందుకు తెచ్చే హిందూత్వ రాజకీయాల పర్యవసానంగా ప్రజలలో మత ప్రాతిపదికన ఏర్పడే చీలిక వలన తమ వోటుబ్యాంకు మాత్రం చెక్కు చెదరదన్న అభిప్రాయం ఉన్నందునే వారి నాయకుడిలో ఆ ఆత్మవిశ్వాసం కానవస్తుంది. ప్రజలెప్పటికీ మారరు, వాస్తవాలు గ్రహించజాలరని భావించడం తీవ్రమైన నిరాశావాదానికి సంకేతం. అయితే ఇప్పటి రాజకీయ వాతావరణంలో ఈ తరహా నిరాశావాదానిదే ప్రస్తుతానికి పైచేయిగా ఉన్నట్టుంది.
(స్వేచ్ఛానుసరణ)