
ప్రజాశక్తి - రామభద్రపురం : ఇ- పంట నమోదుతో రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని స్థానిక వ్యవసాయాధికారి వెంకటయ్య తెలిపారు. మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రం-2లో గురువారం ఇ పంట నమోదు వివరాలు పరిశీలించి దీనివల్ల సమకూరే ప్రయోజనాలను వివరించారు. ఇది రైతు పంటల అమ్మకాలకు, కొనుగోలుకు ఉపయోగ పడుతుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటల నమోదుకు, మద్దతు ధరలు పొందేందుకు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని, ప్రభుత్వం ద్వారా మంజూరైన నష్ట పరిహారాలు చెల్లింపులకు ఉపకరిస్తుందన్నారు. పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు తీసుకోవడానికి ఈ పంటలో నమోదైన వారే అర్హులన్నారు. ఇప్పటికే అర్హులైన రైతులందరికీ వర్తింప జేసామని, ఈ నెలాఖరు వరకు ప్రతీ ఆర్‌బికెలో నమోదైన వారి వివరాలు ప్రదర్శనగా ఉంచుతామని ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకు వచ్చి సరిచేసు కోవాలని కోరారు. ప్రస్తుతం మండలంలో సాగు చేస్తున్న అన్ని పంటలకు సాగునీటి నిల్వలు ఆశా జనకంగానే ఉన్నాయని మరో 10 రోజుల వరకు ఇబ్బంది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బికె సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఈ క్రాఫ్ అర్హుల జాబితా ప్రదర్శన
నెల్లిమర్ల: మండ లంలోని సారిపల్లిలో సామజిక తనిఖీ కోసం ఈ క్రాప్ అర్హులు జాబితాను ఎఒ ఎం. పూర్ణిమ గురువారం ప్రదర్శించారు. ఈ జాబితా ఈ నెల 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు ప్రతీ రైతు భరోసా కేంద్రంలో ప్రదర్శిస్తారని చెప్పారు. ఈనెల 29వ తేదీ వరకు జాబితాలో రైతులు పేర్లు, సర్వే నంబర్స్, పంటల సాగు, విస్తీర్ణంలో ఏలాంటి అభ్యంతరాలు ఉన్న రాత పూర్వకంగా విఎఎ, విహెచ్‌ఏ, విస్‌ఏలకు తెలియజేయాలన్నారు. నవంబర్ 1వ తేదీన తుది జాబితా రైతు భరోసా కేంద్రంలో ప్రదర్శిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ వి భవాని, విఎఎ ఎం హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు.