Sep 03,2022 23:31

రైతులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాధన్‌

ప్రజాశక్తి-యంత్రాంగం
ఆనందపురం : ఈ పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖ జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌ విశ్వనాథన్‌ ఆదేశించారు. ఆనందపురం పంచాయతీ పరిధిలో గల దొంతలవారి కళ్ళాలు వద్ద వరి పంటలను శనివారం ఆయన పరిశీలించారు ఈ పంట నమోదు ద్వారా రైతు భరోసా, పంట ఇన్స్యూరెన్స్‌ రైతు రుణాలు, సబ్సిడీపై రుణాలు తదితర పథకాలు అందుతాయన్నారు. గ్రామంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు కలిసి ఈ పంట నమోదును జాయింట్‌ అజమాయిషీని చేయాలన్నారు. ప్రతి రైతు వేసిన పంటరకాన్ని విధిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కె.అప్పలస్వామి, సహాయ వ్యవసాయ సంచాలకులు బి.విజయ ప్రసాద్‌, వ్యవసాయాధికారి సంధ్య రత్నప్రభ, తహశీల్దార్‌ రామారావు, ఎంపిడిఓ లవరాజు, గ్రామ రెవెన్యూ అధికారి అప్పలరెడ్డి పాల్గొన్నారు.
పద్మనాభం : ఖరీఫ్‌ పంటలకు ఈ-క్రాప్‌ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయాధికారి అప్పలస్వామి సూచించారు. మండలంలోని కొవ్వాడ రైతు భరోసా కేంద్రం పరిధిలో ఉన్న రైతులతో శనివారం ఆయన ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయంపై రైతులకు ఆయన పలు సూచనలు, సలహాలు ఆందించారు. పిఎం కిసాన్‌కు ఇకెవైసి చేయించుకునే గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎడిఎ విజయప్రసాద్‌, మండల వ్యవసాయాధికారి ఎంవి.చలం, సిబ్బంది గోర్రెల శ్రీను తదితరులు పాల్గొన్నారు.