మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెడరలిజంపై, రాష్ట్రాల హక్కులపై దాడులు మొదలయ్యాయి. మొదటగా 370వ అధికరణను రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ దాడి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, సమాఖ్యవాదం లోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తూ వచ్చింది. దాడి ప్రధానంగా మూడు విధాలుగా వుంటోంది. అవి, సమాఖ్యవాదానికి సంబంధించిన రాజ్యాంగ సూత్రాలు, సమాఖ్య వాదంలోని ఆర్థిక కోణాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాల రాజకీయ పునాది పైన వుంటోంది.
ఫెడరల్ వ్యవస్థపై, రాష్ట్రాల హక్కులను ఉల్లంఘించడంపై ఏదో ఒక రకంగా దాడి చేయకుండా రోజు గడవడం లేదు.
ఒక రోజు, కేంద్రం ఏకపక్షంగా వ్యాక్సిన్ విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం రాష్ట్రాలే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలి. వాటికయ్యే ఆర్థిక భారాన్ని భరించాలి. మరో రోజు, పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీని ఆయన పదవీ విరమణ రోజునే ఢిల్లీకి వచ్చి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇంకోసారి, ఇళ్ళ వద్దకే రేషన్‌ను అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. మరో సందర్భంలో, గ్రామీణాభివృద్ధి నిధుల కింద పంజాబ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వందల కోట్ల రూపాయల చెల్లింపులను కేంద్రం నిలిపివేసింది. వ్యవసాయ చట్టాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసినందుకు ప్రతీకారం ఇది.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకై రాష్ట్ర ప్రభుత్వాలను పక్కకు నెట్టి 19 రాష్ట్రాల జిల్లా మేజిస్ట్రేట్లతో ప్రధాని రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు. ప్రధాని మోడీకి ఏ మాత్రమూ తగ్గని రీతిలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాష్ట్రాల విద్యా మంత్రుల భాగస్వామ్యం లేకుండానే నూతన విద్యా విధానం అమలుపై రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశమయ్యారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతం వుండదు. రాజ్యాంగబద్ధమైన కేంద్ర-రాష్ట్ర సంబంధాలను ఉల్లంఘించడమైనా కావచ్చు. లేదా రాష్ట్రాల ఆర్థిక వనరులను దోపిడీ చేయడమైనా కావచ్చు. లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల రాజకీయ జోక్యమైనా కావచ్చు.
ఇవేమీ అప్పుడప్పుడూ జరిగే సందర్భాలు లేదా ఉల్లంఘనలు కాదు. రాజ్యాంగంలోని సమాఖ్య నిబంధనలపై పద్ధతి ప్రకారం జరుగుతున్న దాడి ఇది. నిరంకుశ అధికార కేంద్రీకరణతో రాష్ట్రాల హక్కులను కాలరాయడమే. కరోనా మహమ్మారి తలెత్తిన తర్వాత, విపత్తు నిర్వహణా చట్టం, అంటువ్యాధుల నివారణా చట్టం నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ తరహా దాడులు మరింత పెరిగాయి.
మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెడరలిజంపై, రాష్ట్రాల హక్కులపై దాడులు మొదలయ్యాయి. మొదటగా 370వ అధికరణను రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ దాడి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, సమాఖ్యవాదం లోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తూ వచ్చింది. దాడి ప్రధానంగా మూడు విధాలుగా వుంటోంది. అవి, సమాఖ్యవాదానికి సంబంధించిన రాజ్యాంగ సూత్రాలు, సమాఖ్య వాదంలోని ఆర్థిక కోణాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాల రాజకీయ పునాది పైన వుంటోంది.
రాష్ట్రాలకు సంబంధించిన అంశాలుగా రాజ్యాంగం పేర్కొన్నవాటిలో కేంద్రం జొరబడిన విధానం మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించిన తీరులో కనబడుతోంది. వ్యవసాయం, వ్యవసాయ మార్కెటింగ్ రాష్ట్రాల అంశాలైనప్పటికీ వాటిని ఉల్లంఘించింది. ఈ ఏడాది మార్చిలో ఆమోదించిన ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంత (సవరణ) చట్టంలో కూడా మనం దీన్ని చూడవచ్చు. రాష్ట్రాల అధికారాలకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన అమరికను తీవ్రంగా ఉల్లంఘించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను 'ఢిల్లీ ప్రభుత్వం'గా ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీ అధికారాలు, అధికార పరిధిని మరింతగా తగ్గించి వేశారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో రాష్ట్రాల విధానపరమైన అంశాలను నిర్దేశించేందుకు కేంద్ర ప్రాయోజిత పథకాలను ఉపయోగించడం మరింత వేగంగా కొనసాగుతోంది.
రాష్ట్రాల ఆర్థిక పరిధులు మరింతగా కుదించివేయ బడుతున్నాయి. రాష్ట్రాలకు వున్న పన్నుల విధింపు అధికారాలను వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) వ్యవస్థ లాగేసుకుంది. వీటన్నింటికన్నా గత రెండేళ్ళలో, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జిఎస్‌టి బకాయిలను చెల్లించడానికి కేంద్రం తిరస్కరిస్తోంది. జిఎస్‌టి ఆదాయాలు పడిపోయినందున రాష్ట్రాలకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన నష్టపరిహార మొత్తాలే ఇవి. వీటిని ఇవ్వడం లేదు.
గత రెండు ఆర్థిక సంఘాలు...కేంద్రం ప్రవేశపెట్టిన అదనపు నిబంధనలపై పనిచేశాయి. ఇవి కేంద్రం, రాష్ట్రాల మధ్య రాజ్యాంగబద్ధంగా నిర్ణయించిన వనరుల విభజనకు వివిధ రకాల షరతులను అక్రమంగా జోడించాయి.
కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో, రాష్ట్రాల ఆర్థిక సంక్షోభం మరింత పెరిగిపోయింది. రుణాల పరిమితులను గణనీయంగా సడలించడానికి కేంద్రం తిరస్కరించింది. అదే సమయంలో ఆరోగ్య, జిఎస్‌టి నష్టపరిహార బకాయి మొత్తాలను, రాష్ట్రాలకు చెల్లించాల్సిన ఇతర బకాయిలను ఇవ్వడానికి తిరస్కరిస్తోంది. కరోనా కారణంగా సంభవించిన ఆర్థిక పర్యవసానాలను ఎదుర్కొనడానికి రాష్ట్రాలు అత్యవసరంగా సామాజిక భద్రతా చర్యలను చేపట్టాల్సి రావడం, పైగా ఆరోగ్య రంగంపై అదనపు వ్యయాన్ని భరించాల్సిన సమయంలోనే ఇది కూడా చోటు చేసుకుంది.
రాజకీయంగా, ప్రతిపక్షాల పాలనలో వున్న రాష్ట్రాల పట్ల కేంద్రం ఘర్షణాపూరిత వైఖరిని అనుసరిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో జగదీప్ ధన్‌కర్ మాదిరిగా గవర్నర్లు కేంద్రం లోని పాలక పార్టీ వ్యక్తులుగా పనిచేస్తున్నారు. గవర్నర్లుగా పనిచేసే ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ల పాత్ర గురించి అస్సలు తెలియదు. కేవలం హిందూత్వ ఎజెండాను అమలు చేయడంపైనే వారి దృష్టంతా వుంటోంది.
ఇక కేంద్రపాలిత ప్రాంతాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా వుంటోంది. పుదుచ్చేరికి కిరణ్ బేడి వంటి లెఫ్టినెంట్ గవర్నర్ వున్నపుడు, ఆమె ఒక వైస్రారులా వ్యవహరించారు. అక్కడి ప్రభుత్వంతో నిరంతరం ఘర్షణ పడేవారు. గత అసెంబ్లీ, కొత్త అసెంబ్లీ రెండింట్లో ముగ్గురు ఎంఎల్‌ఎ లను లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేశారు. వారందరూ బిజెపి వారే. పైనుండి పార్టీని ఎలా నిర్మిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ.
అధికారాల కేంద్రీకరణ తీవ్ర స్థాయికి చేరిందనడానికి లక్షద్వీప్ చక్కటి ఉదాహరణ. అక్కడ అడ్మినిస్ట్రేటర్‌గా వున్న బిజెపి వ్యక్తి పలు నియమ నిబంధనలను కొత్తగా ప్రకటించారు. వాటిని అమలు చేస్తే...లక్షద్వీప్ సామాజిక, సాంస్కృతిక నిర్మాణం మొత్తంగా నాశనమవుతుంది. మెజారిటీ పాలన దౌర్జన్యానికి అక్కడ వున్న ముస్లిం జనాభా గురికావాల్సి వస్తుంది.
సమాఖ్యవాదంపై జరుగుతున్న ఈ దాడి...ఇటువంటి వ్యవస్థకు భిన్నమైన వైవిధ్యం, ప్రజాస్వామ్యం, లౌకికవాదంపై మొత్తంగా జరిగే దాడిలో భాగమే. అందువల్ల దీన్ని వ్యతిరేకించాల్సి వుంది. దీనిపై పోరాడాల్సి వుంది. బిజెపి యేతర పార్టీల పాలనలో వున్న రాష్ట్రాలు ఈ పోరాటంలో అగ్ర భాగాన నిలవాలి.
ఇప్పటికే వినాశకర వ్యాక్సిన్ విధానం పట్ల ప్రతిపక్షాల పాలనలోని చాలా రాష్ట్రాలు తమ గళాన్ని వినిపించాయి. రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందించాలని, వాటిని సేకరించాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని డిమాండ్ చేస్తూ తమ వైఖరిని సమన్వయ పరుచుకున్నాయి. అందరూ ఉమ్మడిగా తీసుకున్న ఈ వైఖరితో మోడీ ప్రభుత్వం తన విధానాన్ని సవరించుకోవాల్సి వచ్చింది. జిఎస్‌టి నష్టపరిహారం విషయంలో కూడా, ప్రతిపక్షాల పాలనలోని రాష్ట్రాలు తమ వైఖరిని సమన్వయం చేసుకోవడానికి కొంత కాలంగా ప్రయత్నించాయి. కానీ, సమాఖ్యవాదం రక్షణ, రాష్ట్రాల హక్కులకు సంబంధించి ప్రతిపక్షాల పాలనలోని రాష్ట్రాల మధ్య మరింత సన్నిహితమైన సమన్వయం వుండాల్సిన అవసరం వుంది. ఇప్పటికీ, బిజెపి యేతర ప్రభుత్వాలు వున్న ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు అరకొరగానే వ్యవహరిస్తున్నాయి. లేదా దృఢమైన వైఖరి తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. ఈ మూడు ప్రభుత్వాలను నడుపుతున్న మూడు ప్రాంతీయ పార్టీలు ఒక విషయాన్ని గ్రహించాల్సి వుంది. సమాఖ్యవాదం అంతరించిపోవడం, రాష్ట్రాల హక్కులు దెబ్బతినడం వల్ల భవిష్యత్‌లో ఈ పార్టీల ప్రయోజనాలకే ముప్పు వాటిల్లుతుందని ఆయా పార్టీలు గ్రహించాలి.
ఫెడరలిజం లేదా సమాఖ్యవాదం అవిభాజ్యమైనది. ఢిల్లీని ఒక పెద్ద మున్సిపాలిటీ స్థాయికి కుదిస్తూ చట్టాన్ని సవరించినపుడు... 370వ అధికరణ రద్దుకు మద్దతిచ్చిన ఆప్, అరవింద్ కేజ్రివాల్‌లు...తాము చేసిన తప్పులను గ్రహించి వుండాల్సింది. అలాగే, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి, రాష్ట్రాల అధికారాలపై దాడి చేయడానికి 356వ అధికరణను దారుణమైన రీతిలో ఉపయోగించిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు తమ తప్పులను గ్రహించాల్సి వుంది. ప్రతిపక్షాల పాలన లోని రాష్ట్రాలే కాకుండా, మరింత విస్తృతమైన రీతిలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక తాటి పైకి వచ్చి సమాఖ్యవాదం రక్షణకు నడుం బిగించాలి. రాష్ట్రాల హక్కులను కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలి. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలను పునర్నిర్మించాలి. కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై శ్రీనగర్‌లో జరిగిన సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని సమకాలీన పరిస్థితులకు తగినట్లుగా ఆధునీకరించి ఆ మేరకు వ్యవహరించాలి. నిరంకుశవాదానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటంలో అంతర్భాగంగా సమాఖ్య సిద్ధాంతాలు, రాష్ట్రాల హక్కులకై పోరు వుండాలి.
/ 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం /










