Sep 22,2023 21:10

కొత్తవలస: సిడిపిఒకు వినతినిస్తున్న కార్యకర్తలు

ప్రజాశక్తి - కొత్తవలస : అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 25వ తేదీన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొత్తవలస సిడిపిఒ రొంగలి ఉమాకి శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కాకర తులసి మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం కన్నా అదనంగా వేతనాలు చెల్లించాలన్నారు. తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, రిటైర్మెంట్‌ వయసు 62గా మార్పు చేయాలని ఆఖరి వేతనంతో 50శాతం పెన్షన్‌ పద్ధతి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సహాయక ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ లక్ష్మీబాయి, అంగన్వాడీ కార్యకర్తలు ధనలక్ష్మి, శారద పాల్గొన్నారు.
గజపతినగరం: అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సిడిపిఒకు మాస్‌ లీవ్‌ లెటర్‌ను కార్యకర్తలు అందించారు. ఈనెల 25వ తేదీన విజయవాడలో జరుగు మహా ధర్నాలో పాల్గొనడానికి సెలవు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వి లక్ష్మి, ప్రాజెక్ట్‌ అధ్యక్షులు ఎం సుభాషిని, గజపతినగరం సెక్టార్‌ లీడరు డి నాగమణి పాల్గొన్నారు.