''ఏ మనిషినైనా మంత్రాలతో చంపెయ్యొచ్చు., ఐతే దానితోపాటు కాస్త విషం కూడా ఇవ్వాలి'' అని వోల్టేర్ అన్నాడు. వోల్టేర్ హేతువాది. అందుకే మంత్రాలు పనిచెయ్యవని, విషం ఇస్తే తప్ప మనిషి కేవలం మంత్రాలతో చావడని అన్నాడు. ఇక్కడ మన బిజెపి ప్రభుత్వం చూస్తే హేతువాదాన్ని ఒప్పుకోదు. అందుచేత కేవలం మంత్రాలతోటే ఆర్థిక వ్యవస్థను కోలుకునేలా చేయాలని చూస్తోంది. ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ఇచ్చిన వాగ్దానం ఇదే.
రిజర్వు బ్యాంకు అంచనా ప్రకారం 2020-21లో మన ఆర్థిక వ్యవస్థ ఆ ముందటి ఏడాదితో పోల్చితే 7.7 శాతం కుంగిపోయింది. ప్రస్తుత సంవత్సరం తో పోల్చితే 2021-22లో 10.5 శాతం కోలుకుంటుంది. (ఆర్థ్ధిక సర్వేలో 11 శాతం కోలుకుంటుందని అంచనా వేశారు. ఈ రెండింటిమధ్య తేడా కి పెద్ద ప్రాధాన్యత లేదు. ఈ వ్యాసంలో నేను చెప్పే వాదన 10.5 వృద్ధి అంచనాకు వర్తిస్తే అది 11 శాతం వృద్ధి అంచనాకు ఇంకా బాగా వర్తిస్తుంది) ఈ లెక్కలబట్టి చూస్తే 2019-20 తో పోల్చినప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిడిపి లో నామమాత్రపు వృద్ధి (గట్టిగా చెప్పాలంటే 2 శాతం) మాత్రమే ఉంటుంది. ఈ అంచనా ప్రాతిపదికనే ప్రభుత్వం చూపిస్తూ వి-ఆకారపు( ఇంగ్లీషు లో వి అక్షరం ఆకారం) రికవరీ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏ ఎత్తునుంచి ఆర్థిక వ్యవస్థ గోతిలో పడిపోయిందో తిరిగి అదే ఎత్తుకు చేరుకుంటుంది అని అర్ధం. ఇప్పుడు గోతిలో ఉన్న పరిస్థితినుండి 10.5 శాతం రికవరీతో తిరిగి కోలుకోవాలంటే అందుకు దోహదం చేసే వివిధ అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
ఒక దేశపు జిడిపి ఆ దేశపు వినియోగం (సి)+ పెట్టుబడి(ఐ)+ప్రభుత్వ వ్యయం (జి)+నికర ఎగుమతులు (మొత్తం ఎగుమతులు మైనస్ మొత్తం దిగుమతులు లేదా ఇ మైనస్ ఎం) తో సమానంగా ఉంటుంది. అందుచేత జిడిపి 10.5 శాతం పెరగాలంటే పైన తెలిపిన అంశాలన్నింటిలోనూ ఆ మేరకు పెరుగుదలను 2020-21 తో పోల్చితే రాబట్టాలి. వచ్చే ఏడాది కాలంలో నికర ఎగుమతులు ఎంత పెరుగుతాయో, లేదా తరుగుతాయో ఇప్పుడు ఎవరూ చెప్పగలిగే పరిస్థితి లేదు. అందుచేత దానిని పక్కన పెడదాం. ఇక తక్కిన సి+ఐ+జి లోనే 10 శాతం పైగా వృద్ధి సాధించాలి. అందుకు దోహదపడే విధాన పరమైన చర్యలేమైనా ఈ బడ్జెట్‌లో ప్రకటించారేమో చూద్దాం.
2020-21 సవరించిన అంచనాల ప్రకారం ప్రభుత్వ వ్యయం రు.34.503 లక్షల కోట్లు. ఇది 2021-22లో రు.34.832 లక్షల కోట్లకు పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని పక్కనబెట్టి లెక్క కడితే ఇది ఒక శాతం కన్నా తక్కువ పెరగనుంది. పెరిగే ధరలను పరిగణిస్తే వాస్తవంగా ప్రభుత్వ వ్యయం తగ్గనుంది. ప్రభుత్వ వ్యయం ద్వారా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుదలకు ఎంత అదనపు దన్ను వస్తుంది అని చూస్తే మాత్రం గతేడాది మహమ్మారి కాలంలో వచ్చిన దానికన్నా తక్కువే ఉంటుందని స్పష్టమవుతుంది.
సాధారణంగా జిడిపి ఏ రేటున పెరుగుతుందో అదే రేటున వినిమయం పెరుగుతుంది. కాని వచ్చే ఏడాదిలో ఈ విధంగా జరగకపోవచ్చునని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. జిడిపి వృద్ధి చెందే రేటు కన్నా తక్కువ రేటులో వినిమయం పెరిగే సూచనలే ఉన్నాయి. మహమ్మారి కాలంలో చాలామంది కార్మికులు తమ అవసరాలకోసం అప్పులు చేశారు. అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్ కారణంగా వారు పనులను కోల్పోయారు. దానితో వారి ఆదాయాలూ లేకుండా పోయాయి. అందుకే వారు అప్పులు చేయవలసివచ్చింది. ఇప్పుడు వారి ఆదాయాలు పెరిగినప్పటికీ, వారు చేసిన అప్పులను తిరిగి చెల్లించవలసివుంటుంది. అందుచేత ఏ మేరకు ఆదాయాలు పెరిగాయో అదే మేరకు వారి వినిమయం పెరిగే అవకాశం లేదు. ప్రభుత్వ వ్యయంలో ఒక శాతం పెరుగుదల ఉన్నా, వినిమయం లో ఆ ఒక శాతం పెరుగుదల కూడా ఉండే అవకాశం లేదు. ప్రభుత్వం చెప్తున్నట్టు 10.5 శాతం జిడిపి లో పెరుగుదల వచ్చినా, వినిమయంలో అదే మేరకు పెరుగుదల ఉండదు.
ఇక మిగిలినది ప్రైవేటు పెట్టుబడి, బడ్జెట్‌లో ప్రస్తావించని పబ్లిక్ పెట్టుబడి మాత్రమే. పబ్లిక్ పెట్టుబడి అంటే ప్రభుత్వరంగ సంస్థలు పెట్టే పెట్టుబడి వంటివి. మహమ్మారి కాలంలో లాక్‌డౌన్ కారణంగా అనేక ప్రాజెక్టుల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఒకసారి లాక్‌డౌన్ సడలించగానే ఆ నిలిచిపోయిన ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయడానికి ఒక్కసారి పెట్టుబడి వ్యయాన్ని పెంచవలసివచ్చింది. ఇది గతేడాది సంగతి. ఇక వచ్చే ఏడాది 2021-22 సంగతి చూస్తే, పెట్టుబడి వ్యయం గతేడాది తీసుకున్న నిర్ణయాల ఆధారంగా జరుగుతుంది. (ఇంకా పూర్తి కాకుండా నడుస్తూవున్న పనులను మినహాయించితే) గతేడాది కరోనా కాలం. ఉత్పత్తి కుంచించుకుపోయిన కాలం. 2021-22లో మహా అయితే 2019-20 నాటి స్థాయికి తిరిగి ఉత్పత్తి చేరుతుందని అంచనా వేశారు. ఆ స్థాయి ఉత్పత్తిని చేయడానికి కావలసిన సామర్ధ్యం ఇదివరకే ఉంది. కనుక అదనంగా ఉత్పత్తి సామర్ధ్యం పెంచవలసిన అవసరం పెద్దగా లేదు. ఉన్నదే సరిపోతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ పెద్దగా పూనుకోరు. అందుచేత 2020-21 తో పోల్చితే పెట్టుబడికి, ఆదాయాలకు మధ్య నిష్పత్తి 2021-22లో తక్కువగానే ఉంటుంది.
మొత్తంగా చూసినప్పుడు జిడిపి లో అంతర్భాగాలైన (నికర ఎగుమతుల గురించి ఎవరికీ ఇప్పుడే ఎటువంటి అంచనా ఉండే అవకాశం లేదని ముందే చెప్పుకున్నాం) వినిమయం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం- ఈ మూడింటిలోనూ 10.5 శాతం కన్నా తక్కువే వృద్ధి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టు జిడిపి 10.5 శాతం పెరిగినా, దాని వినియోగం అదే మోతాదులో పెరగదు. (అనూహ్యంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో బ్రహ్మాండమైన బూమ్ వచ్చేసి మన సరుకులకు విపరీతంగా ఇతర దేశాలలో డిమాండ్ వచ్చేసి ఎగుమతులు అమాంతం పెరిగిపోతే తప్ప) వినిమయం ఉండబోవడం లేదని నిర్ధారణ అయిన తర్వాత ఇక ఉత్పత్తి మాత్రం ఎందుకుంటుంది? అదీ ఉండదు.
అంచనా వేసిన స్థాయిలో ఉత్పత్తి గనుక ఉండకపోతే అది వినిమయాన్ని మరింత తగ్గిస్తుంది. అంటే వృద్ధిరేటు అంచనా వేసిన మేరకు ఉండదు.
అందుచేత మన భారత ఆర్థిక వ్యవస్థలో వి-ఆకారంలో రికవరీ ఉంటుందని భావించడానికి ఎటువంటి ప్రాతిపదికా లేదు. ఈ బడ్జెట్ అటువంటి రికవరీకి ఏ విధంగానూ తోడ్పడడం లేదు. ప్రభుత్వ వ్యయంలో వాస్తవ పెరుగుదలకు బడ్జెట్ ఏ విధమైన కేటాయింపులూ చేయలేదు. 10.5 శాతం వృద్ధి రావాలంటే కనీసం ప్రభుత్వ వ్యయాన్ని 10.5 శాతమైనా పెంచాలి కదా. కాని బడ్జెట్ గతేడాది వ్యయం కన్నా తక్కువగానే వాస్తవ వ్యయాన్ని ప్రతిపాదించింది.
ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా చూడాలి. 2020-21లో ద్రవ్యలోటు 9.5 శాతం. ఇది 2021-22లో 6.8 శాతం గా ఉండబోతుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. ప్రభుత్వ వాస్తవ వ్యయం పెరగకపోయినా జిడిపి 10.5 శాతం పెరుగుతుందని లెక్కవేసి, దానికి తగ్గట్టు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందని లెక్కగట్టారు. కాని జిడిపి అంచనాలమేరకు పెరగకపోతే, ప్రభుత్వ వ్యయం బడ్జెట్ ప్రకారమే జరిగినా ద్రవ్యలోటు మాత్రం బాగా పెరుగుతుంది. ద్రవ్యలోటును తగ్గించాలని గనుక ప్రభుత్వం భావించి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తే వృద్ధి రేటు ఇంకా తగ్గిపోతుంది.
అందుచేత ఈ బడ్జెట్ మన దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోడానికి ఎంత మాత్రమూ దోహదపడేదిగా లేదు. దీని పర్యవసానంగా మన దేశాన్ని కొన్నేళ్ళుగా పీడిస్తున్న నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. ఇప్పటికే కరోనా కాలంలో అది తీవ్ర రూపం దాల్చింది. ఒకవేళ బడ్జెట్‌లో అంచనా వేసినట్టు వృద్ధిరేటు వచ్చినా అది బడా కార్పొరేట్ సంస్థల్లో, సంఘటిత రంగంలో మాత్రమే ఎక్కువగా ఉండి చిన్నఉత్పత్తిదారులను దెబ్బతీసే విధంగా ఉండబోతుంది. దానివలన వృద్ధిరేటు పెరిగినా నిరుద్యోగం మాత్రం బాగా పెరుగుతుంది. అర్ధంలేని నోట్లరద్దు తో మోడీ ప్రభుత్వం ఇదివరకే చిన్న ఉత్పత్తిదారులను బాగా దెబ్బ తీసింది. దానికి లాక్‌డౌన్ తోడైంది. చిన్న తరహా ఉత్పత్తిలో కలిగే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడా చిన్న తరహా ఉత్పత్తి కోలుకోలేని స్థితిలో పడి చితికిపోతే నిరుద్యోగం మరింత తీవ్రతరమవుతుంది. ఇక వృద్ధిరేటు అనుకున్న విధంగా గనుక రాకపోతే ఈ సమస్య ఇంకా భయంకరంగా మారుతుంది.
ప్రస్తుత పరిస్థితిలో ఎటువంటి బడ్జెట్ మన దేశానికి అవసరమో సరిగ్గా దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఈ బడ్జెట్ ఉంది. చాలామంది ఈ బడ్జెట్ ఆర్థిక రికవరీకి తోడ్పడుతుందని మెచ్చుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బహుశా బడ్జెట్ ప్రసంగంలో అత్యంత చీదర పుట్టించే పదాలను అత్యంత అట్టహాసంగా ప్రయోగించడంతో వాస్తవ స్థూల ఆర్థిక చిత్రం కాస్తా కనపడకుండా పోయిందనుకుంటాను.
* ప్రభాత్ పట్నాయక్ (స్వేచ్ఛానుసరణ)










