బడ్జెట్‌లో ఈ కేటాయింపులు ఏదో యథాలాపంగా కేటాయించేవి కావు. ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్రవ్య వ్యూహం ప్రకారమే ఈ కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ రోజు మనకు కనపడుతున్న ద్రవ్యోల్బణం, దానికి తోడైన మాంద్యం వెనుక ప్రధాన కారణం ఈ ద్రవ్య విధానమే. సంపన్నులకు పన్ను రాయితీలు ఇస్తే ఆ ప్రోత్సాహంతో వారు పెట్టుబడులు మరింత ఎక్కువగా పెట్టడానికి ముందుకు వస్తారన్న అంచనా ఇందులో ఉంది. అలా రాయితీలు ఇచ్చినందు వలన ప్రభుత్వం కోల్పోయే పన్ను రాబడిని పూడ్చుకోడానికి పరోక్ష పన్నులను, ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులపై పన్నులను పెంచడం ఆ వ్యూహంలో భాగమే. ఒకవేళ దానివలన ఆశించిన మేరకు పన్ను రాబడి రాకపోతే ఆ మేరకు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తారు. అంటే ప్రజా సంక్షేమానికి ఖర్చు తగ్గిస్తారు. మన ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా దాని దిశను రివర్స్ చేయాలంటే ఈ వ్యూహాన్ని మార్చాలి.
బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఇంతటి దయనీయ స్థితిలో ఉండడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు. నిరుద్యోగం ఎంత ఘోరంగా ఉందంటే బీహార్‌లో, యు.పి.లో ఉద్యోగాల కోసం అల్లర్లు జరిగాయి. సంపదలో, ఆదాయాల్లో అసమానతలైతే ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువగా ఉన్నాయి. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ ల కారణంగా పదుల లక్షలమంది కొత్తగా పేదరికంలోకి నెట్టబడ్డారు. నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోడానికి, అదే సమయంలో పేదలకు ఊరట కల్పించడానికి, ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడానికి తోడ్పడే వ్యూహం ఇప్పుడు తక్షణం అవసరం. 2022-23 సంవత్సరపు బడ్జెట్ అటువంటి వ్యూహాన్నే ప్రతిపాదించి వుండాలి. కాని, ఆవిధంగా చేయలేదు సరికదా, ఆర్థిక వ్యవస్థలో అటువంటి సమస్యలు ఉన్నాయన్న సంగతిని కూడా బడ్జెట్ గుర్తించలేదు. ఆ ముందు రోజున పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే ఎంతో నిర్లిప్తతను ప్రదర్శించింది. దానినే బడ్జెట్ మరింత ఎక్కువగా ప్రదర్శించింది.
2022-23 బడ్జెట్‌లో మొత్తం ప్రభుత్వ వ్యయం రూ.39.45 లక్షల కోట్లుగా చూపించారు. 2021-22 సంవత్సరానికి సవరించిన అంచనాల కన్నా ఇది కేవలం 4.6 శాతం మాత్రమే ఎక్కువ. ఇది ప్రస్తుత ద్రవ్యోల్బణపు రేటు కన్నా తక్కువ. దానర్ధం వాస్తవ విలువ ప్రకారం ఈ ఏడాది ప్రభుత్వ వ్యయం గతేడాది కన్నా తగ్గుతుంది. అందుచేత గతేడాది వాస్తవ జిడిపి వృద్ధి రేటు కన్నా ఈ ఏడాది తగ్గుతుంది. ఆర్థిక సర్వే అంచనా వేసిన 8 శాతం-8.5 శాతం కన్నా తక్కువగానే ఉండబోతున్నది. ఆర్థిక వ్యవస్థ పురోగమనాన్ని ప్రేరేపించడంలో ప్రభుత్వ వ్యయానికి ఉండే పాత్ర ఎటువంటిదో ఈ ప్రభుత్వం అర్ధం చేసుకోవడం లేదు. పైగా, ప్రభుత్వ వ్యయం గనుక పెరిగితే, దాని వలన ఆర్థిక వ్యవస్థ మరింత నీరుగారి పోతుందన్నట్టు అనుకుంటోంది. ఈ బడ్టెట్‌లో ప్రభుత్వ పెట్టుబడి వ్యయం 35 శాతం పెరగనుంది. ఐతే మొత్తం దేశంలో డిమాండ్ పెరగాలంటే కేవలం పెట్టుబడి వ్యయం మాత్రం పెరిగితే చాలదు. మొత్తంగానే, అన్ని రంగాలలోనూ ప్రభుత్వ వ్యయం పెరగాలి.
డిమాండ్ ను పెంచడానికి అవసరమైన చర్యలను వేటినీ చేపట్టకపోవడమే గాక, ఈ బడ్జెట్ శ్రామిక ప్రజలకు ఊరట కలిగించే చర్యలను కూడా చేపట్టలేదు. వాస్తవానికి పేదలకు లబ్ధి కలిగించే వివిధ పథకాలకు కేటాయింపులు చూస్తే 2021-22 సవరించిన అంచనాల కన్నా వాటిలో కోతలు పడ్డాయి. 2021-22 సవరించిన అంచనాల ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 98,000 కోట్లు, 2020-21 సంవత్సరానికి రూ. 1,10,000 కోట్లు వెచ్చిస్తే ఈ ఏడాది కేవలం రూ. 73,000 కోట్లు మాత్రమే కేటాయించారు. బడ్జెట్ కేటాయింపులతో ఈ పథకానికి నిమిత్తం లేదని, ఈ ఏడాది ఎంతమంది పని కావాలని కోరితే అందరికీ పనులు కల్పిస్తారని సర్ది చెప్తున్నారు. అది నిజమే కావచ్చు. కాని బడ్జెట్ లో కేటాయింపులు చేయకపోతే, చేసిన పనులకు వేతనాలు చెల్లించడం ఆలస్యం అవుతుంది. అందువల్ల ఆ పనులు కావాలని కోరేవారి సంఖ్య తగ్గిపోతుంది. అదేమాదిరిగా ఆహార సబ్సిడీకి కూడా 2021-22 సవరించిన అంచనాలతో పోల్చితే 28 శాతం తగ్గిపోయింది. ఎరువులపై ఇచ్చే సబ్సిడీలు 25 శాతం, పెట్రోలియంపై 11 శాతం తగ్గిపోయాయి. మధ్యాహ్న భోజన పథకానికి, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి కేటాయింపులలో ఎలువంటి పెరుగుదలా లేదు. అంటే వాస్తవ విలువ ప్రకారం కేటాయింపులు తగ్గిపోయాయి.
మరీ అన్యాయంగా కనిపించే విషయం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం పద్దు కింద కేటాయింపులు గతేడాది ఎంత ఉండినాయో, ఈ ఏడాదీ అంతే కేటాయించారు. అంటే వాస్తవ విలువల ప్రకారం తగ్గిపోయింది. ఒక మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో వైద్య, ఆరోగ్య రంగానికి కేటాయింపులు వాస్తవ విలువల ప్రకారం చూసుకున్నప్పుడు తగ్గిపోయాయి! నిజానికి ఇటువంటి సమయంలో ఈ రంగానికి జిడిపి లో 3 శాతం వరకూ కనీసం కేటాయించాల్సి వుంది. గతంలో ఈ విషయంలో ప్రభుత్వం ఈ రంగానికి క్రమంగా కేటాయింపులను పెంచుతూ జిడిపి లో 3 శాతం వరకూ తీసుకువస్తామని హామీ ఇచ్చింది. కాని ఇటువంటి విపత్కర సమయంలో కూడా ఆ విధంగా చేయలేదు. అంతే కాదు. జిడిపి తో పోల్చితే ఈ రంగానికి కేటాయింపుల శాతం గతేడాది కన్నా తగ్గిపోయింది! విద్యా రంగానికి కేటాయింపులు గతేడాది కన్నా 18.5 శాతం అధికంగా పెంచామని చెప్తున్నారు. నిజమే. అయితే, అందులో అధిక భాగం డిజిటల్ చదువుల కోసం కేటాయించారు. అంతేకాక, జిడిపి తో పోల్చితే గతేడాది ఎంత శాతం విద్య కోసం కేటాయించారో, ఈ ఏడాదీ అంతే శాతం, అంటే 3.1 శాతం, మాత్రమే కేటాయించారు. సామాజిక సంక్షేమ రంగానికి కేటాయించినదానిలో భారీగా కోతలు పెట్టడమే గాక, రాష్ట్రాలకు కేటాయించే వనరుల లోనూ కోతలు పెట్టారు. అంకెల్లో చూస్తే రాష్ట్రాలకు కేటాయింపుల్లో 9.6 శాతం గతేడాది కన్నా పెరిగినట్టు ఉంటుంది. కాని, జిడిపి లో శాతంగా చూస్తే అది 6.25 శాతం గా ఉంది. అదే గతేడాది మాత్రం 2021-22 సవరించిన అంచనాల ప్రకారం 6.95 శాతం ఉంది. అంటే వాస్తవ విలువల ప్రకారం రాష్ట్రాలకు కేటాయింపులు తగ్గిపోయాయి.
బడ్జెట్ లో ఈ కేటాయింపులు ఏదో యథాలాపంగా కేటాయించేవి కావు. ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్రవ్య వ్యూహం ప్రకారమే ఈ కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ రోజు మనకు కనపడుతున్న ద్రవ్యోల్బణం, దానికి తోడైన మాంద్యం వెనుక ప్రధాన కారణం ఈ ద్రవ్య విధానమే. సంపన్నులకు పన్ను రాయితీలు ఇస్తే ఆ ప్రోత్సాహంతో వారు పెట్టుబడులు మరింత ఎక్కువగా పెట్టడానికి ముందుకు వస్తారన్న అంచనా ఇందులో ఉంది. అలా రాయితీలు ఇచ్చినందు వలన ప్రభుత్వం కోల్పోయే పన్ను రాబడిని పూడ్చుకోడానికి పరోక్ష పన్నులను, ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులపై పన్నులను పెంచడం ఆ వ్యూహంలో భాగమే. ఒకవేళ దానివలన ఆశించిన మేరకు పన్ను రాబడి రాకపోతే ఆ మేరకు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తారు. అంటే ప్రజా సంక్షేమానికి ఖర్చు తగ్గిస్తారు. మన ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా దాని దిశను రివర్స్ చేయాలంటే ఈ వ్యూహాన్ని మార్చాలి. కాని మోడీ ప్రభుత్వానికి తన వంకర వ్యూహపు పరిధిని దాటి ఆలోచించగలిగే సత్తా లేదు. ఓ పక్కన ఎన్ని పన్ను రాయితీలను సంపన్నులకు కల్పించినా, ప్రైవేటు పెట్టుబడి పెరగడంలేదు సరికదా, కుంగిపోతోంది. దానికి కారణం మార్కెట్‌లో నెలకొన్న మాంద్యం. అయినా మోడీ ప్రభుత్వం తన వ్యూహాన్ని అదే విధంగా ఈ బడ్జెట్ లోనూ కొనసాగించింది. ఎటువంటి ఇతర ఇంధనాలనూ కలపని పెట్రోలియం ఇంధనంపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచి దాని ధర లీటరుకి రు.2 చొప్పున పెంచారు. మన దేశంలో ఎక్కువగా ఈ తరహా ఇంధనాన్నే వాడతారు. ఇంకోవైపు సబ్సిడీలలో కోత పెట్టారు (సబ్సిడీలలో కోత పెట్టినా, పరోక్ష పన్నులను పెంచినా, దాని పర్యవసానం ఒకటే).
ఈ వంకర వ్యూహం పరిధిలో ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి గాని, ప్రజలకు ఏ విధమైన ఊరట కల్పించడానికి గాని ఎటువంటి ఆస్కారమూ లేదు. మహా అయితే ఒక పద్దు నుంచి ఇంకో పద్దుకి కేటాయింపులు మార్చి తనకు అనుకూలంగా ప్రచారం చేసే మీడియా ద్వారా తామెంత ఉదారంగా వ్యవహరించామో సొల్లు వాగుడు వాగడానికి మాత్రం వీలవుతుంది. అటువంటి పైపై మెరుగులనే ఈ సారి కూడా చూపిస్తారేమోనని అనుకుంటే, అది కూడా లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించే ధోరణి. మధ్యతరగతికి ఆదాయపన్ను రాయితీ కొత్తగా కల్పించింది ఏమీ లేదు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి వీలుగా పరోక్ష పన్నులలో తగ్గించింది కూడా ఏమీ లేదు. పైగా సాంఘిక సంక్షేమ పథకాలపై చాలా కోతలు పెట్టారు. ప్రజల ఇక్కట్లు పెరిగినప్పటికీ ఈ విధంగా చేశారు. కొన్ని ప్రధాన రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో కూడా ప్రభుత్వం ఈ విధంగా బడ్జెట్‌లో చేయగలిగిందంటే ఆ ఎన్నికల్లో మత చీలికలను ఉపయోగించుకుని ఎలాగైనా తాను గెలవగలనన్న ధీమాతో ఈ ప్రభుత్వం ఉందని మనకు అర్ధం అవుతుంది.
పెరుగుతున్న దారిద్య్రాన్ని తగ్గించడానికి ఈ బడ్జెట్ లో ఎటువంటి ప్రయత్నమూ లేదు. అందువలన దారిద్య్రం మరింత పెరగనుంది. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. ప్రైవేటు వినిమయం తగ్గిపోతూ వుంది. ఇప్పటికీ అది 2019-20 నాటి వినియోగ స్థాయి కన్నా తక్కువగానే ఉంది. వినిమయ వస్తువుల తయారీ రంగంలో ఉత్పత్తి సామర్ధ్యం 2019-20 నాటి స్థాయిలోనే కొనసాగుతున్నా, వినిమయం తగ్గినందువలన ఆ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించడం సాధ్యం కాదు. అందువలన స్థాపిత ఉత్పత్తి సామర్ధ్యం నిరుపయోగంగా ఉండిపోతుంది. పైగా 2019-20 కన్నా ముందే తీసుకున్న నిర్ణయాలను అమలు చేసిన కారణంగా ఈ రంగాలలో ఉత్పత్తి సామర్ధ్యం ఈ మధ్య మరికొంత పెరిగింది. అది కూడా నిరుపయోగంగా మిగిలిపోక తప్పదు. అందువలన ఈ ఏడాది గత సంవత్సరంలో మాదిరిగా ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి పెట్టుబడులు వ్యయం చేయరు. అంటే గతేడాది స్థాయిలో కూడా ఈ ఏడాది పెట్టుబడులు ఉండవు. ఇంకా తగ్గుతాయి. అందువలన మాంద్యం, నిరుద్యోగం మరింత తీవ్ర సమస్యలుగా పెరుగుతాయి.
బాహ్య పరిణామాల వలన కూడా ద్రవ్యోల్బణం సైతం పెరగనుంది (ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే పేరుతో ప్రభుత్వ వ్యయం కుదిస్తే దానివల్ల మాంద్యం, నిరుద్యోగం మరింత పెరుగుతాయి). అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగనున్నాయి. అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆ దేశంలో వడ్డీ రేట్లు పెంచడానికి సిద్ధమౌతున్నారు. ఇప్పుడక్కడ వడ్డీ రేట్లు దాదాపు సున్నాగా ఉన్నాయి. అందకనే భారతదేశానికి విదేశాల నుండి ద్రవ్య పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. దానివలన మన విదేశీ వ్యాపారంలో చెల్లింపుల లోటు తలెత్తకుండా సర్దుబాటు చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు గనుక అమెరికాలో, ఇతర దేశాల్లో వడ్డీ రేట్లు పెరిగితే విదేశీ ద్రవ్య పెట్టుబడులు వెనక్కి పోయి, విదేశీ మారకద్రవ్యం లోటు ఏర్పడుతుంది. అప్పుడు విదేశీ వ్యాపారంలో చెల్లింపుల లోటు రావడమే గాక, రూపాయి విలువ కూడా పడిపోతుంది. దిగుమతుల కోసం చెల్లించవలసిన సొమ్ము రూపాయిలలో చూసినప్పుడు పెరిగిపోతుంది. అప్పుడు పెట్రో ధరలు మరింత పెరుగుతాయి. ఆ భారం వినియోగదారులపై పడుతుంది. దానివలన దేశీయంగా ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది.
ప్రజల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాని మోడీ ప్రభుత్వ దృష్టి లోపం కారణంగా వాటిని అది గుర్తించలేకపోతున్నది. ఇలా గుర్తించలేకపోవడం బట్టి రాబోయే కాలంలో మరింత ప్రమాదకర పరిణామాలు జరగనున్నాయని చెప్పవచ్చు. విదేశీ చెల్లింపుల లోటు చేయి దాటిపోయిన పరిస్థితి వస్తే, అప్పుడు మోడీ ప్రభుత్వం ఐఎంఎఫ్ దగ్గరికి పరిగెత్తి తనను ఆదుకోమని అర్ధిస్తుంది. అప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చే ప్యాకేజీతోబాటు పొదుపు చర్యలు కూడా మరిన్ని వస్తాయి. భారతదేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిన తక్కిన మూడో ప్రపంచ దేశాల మాదిరిగా దిగజారుతుంది. ఇప్పటికే, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా వ్యవహరించాలనే పేరుతో మనదేశం తన స్వయంప్రతిపత్తిని కొంత కోల్పోయింది. ఇప్పుడు దానికి ఐఎంఎఫ్ విషమ షరతులు కూడా తోడైతే ఆ కాస్త మిగిలిన స్వయంప్రతిపత్తి కూడా పూర్తిగా అంతరించిపోతుంది. అదే జరిగితే పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోడానికి గ్రీస్ ఒక ఉదాహరణ. అంతవరకూ రాకుండా మన దేశం ఇంతకాలమూ కాసుకోగలిగింది. కాని ఇప్పటి పరిస్థితుల్లో బొత్తిగా ఆర్థిక విషయాల అవగాహన లేని ప్రభుత్వం అధికారంలో ఉన్నందువలన మన దేశాన్ని కూడా ఆ దిశ వైపే నెట్టే ప్రమాదం ఉంది. బడ్జెట్ లో ప్రస్తావించకుండా మౌనం వహించిన ఈ విషయాలు మన ప్రజలకేగాక, మొత్తం దేశానికే ప్రమాదకర సంకేతాలు.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్ పట్నాయక్











