అడ్డగోలు నిబంధనలతో రైతుల అవస్థలు
ఒక రైతు నుంచి 12.50 ఎకరాల్లో ధాన్యమే సేకరణ : అధికారులు
మిగిలిన పంట ఏం చేయాలంటూ రైతుల ఆగ్రహం
ఇ-క్రాప్‌లో నమోదైనా కొనుగోలు చేయకపోవడంపై తీవ్ర ఆవేదన
ఉంగుటూరు మండలంలో సమస్య తీవ్రం
ఇబ్బందికరంగా ఎకరాకు 65 సంచుల నిబంధన
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
'సాగు చేసిన ప్రతి పంటా ఇ-క్రాప్‌లో నమోదు కావాలి. నమోదైతేనే రైతు నుంచి పంటను కొనుగోలు చేస్తాం. లేకుంటే పంట కొనుగోలు అసాధ్యం' అని ప్రభుత్వం, అధికారులు ఇప్పటి వరకూ ఊదరగొట్టారు. కానీ నేడు ఇ-క్రాప్‌లో పంట నమోదు చేసినా 12.50 ఎకరాల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని, మిగిలిన పంటను కొనుగోలు చేయడం కుదరదంటూ అధికారులు చెబుతున్న నిబంధన రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇదేమని అడిగినా సమాధానం చెప్పేవారు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన నూతన విధానంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. ఇప్పటి వరకూ దాదాపు 70 శాతం వరకూ మాసూలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ స్థాయిలో ధాన్యం కొనుగోలు మాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అన్నదాతను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా అధికారులు చెబుతున్న కొత్త నిబంధనతో రైతులు తలలుపట్టుకుంటున్నారు. నూటికి నూరుశాతం ఇ-క్రాప్ పూర్తిచేశామని, పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జరుగుతుందని నిన్నటి వరకూ అధికారులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇ-క్రాప్ పంటలకు సంబంధించిన ధాన్యం కూడా కొనుగోలు చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఖరీఫ్‌లో సాగుచేసిన ప్రతి ఎకరాకు సంబంధించి ఇ-క్రాప్ పూర్తిచేశామన్న అధికారులు ఇప్పుడేమో మరోలా మాట్లాడుతున్నారు. జిల్లాలో చాలా మంది రైతులకు 15 ఎకరాలు, 20 ఎకరాలు, ఆపైన భూములున్న రైతులున్నారు. ఈ భూములను అధికారులు ఇ-క్రాప్‌లో నమోదుచేశారు. రైతులు మాసూలు పూర్తిచేసి ధాన్యం తీసుకు వెళితే 12.50 ఎకరాల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని రైతుభరోసా కేంద్రంలో చెబుతున్నారు. మరి మిగిలిన ధాన్యం పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడం లేదు. ఈ నిబంధన గురించి అప్పుడే చెబితే ఇంట్లో కుటుంబ సభ్యుల పేరుపై కొంత పొలం ఇ-క్రాప్ చేయించుకునేవారమని రైతులు లబోదిబోమంటున్నారు. సరికొత్త నిబంధనలతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వానికి తగదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నిబంధనతో రెండుజిల్లాల్లోనూ అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉంగుటూరు మండలంలోని నాచుగుంట, కాగుపాడు, ఉంగుటూరుతో పాటు పలు గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. రైతుభరోసా కేంద్రాల్లో సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు వాపోతున్నారు.
తలనొప్పిగా 65 సంచుల నిబంధన
ధాన్యం కొనుగోలులో తెచ్చిన కొత్తనిబంధనలతో రైతులు తీవ్రంగా నలిగిపోతున్నారు. ధాన్యం దిగుబడి ఎక్కువగా వచ్చినా సమస్యగా మారడంతో అన్నదాతకు ఏంచేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఎకరాకు 40 కిలోల బరువుగల 65 సంచులను మాత్రమే రైతుభరోసా కేంద్రాల్లో ఇస్తున్నారు. అంటే 75 కిలోల విలువ చేసే 34 బస్తాలకు మాత్రమే సంచులు ఇస్తున్నారు. కొన్నిచోట్ల ఎకరాకు 38 బస్తాలు, 40 బస్తాల దిగుబడి వస్తుంది. దీంతో రైతులు ఆనందపడాలో బాధపడాలో తెలియడం లేదు. 65 సంచుల ధాన్యం మాత్రమే రైతుభరోసా కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. అంతకు మించి ధాన్యం దిగుబడి వచ్చినా కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆ ధాన్యం ఏ విధంగా విక్రయించాలో తెలీక రైతులు తలలుపట్టుకుంటున్నారు. 65 సంచుల విధానంపై రైతులు ఆదినుంచి మొరపెట్టుకుంటున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఉన్నతాధికారులు సైతం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.










