ప్రజాశక్తి-అనకాపల్లి : పంటలను ఈ-క్రాప్ నమోదులో సవరణలను ఈ నెల 31వ తేదీలోగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని జిఎస్‌ఎన్‌ఎస్.లీలావతి అన్నారు. మండలంలోని మార్టూరు రైతు భరోసా కేంద్రాన్ని శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాగుచేసిన రైతుల పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌బికె గొడౌన్‌లో ఉన్న యూరియా నిల్వలను రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో వరి పంటను పరిశీలించారు. వరి పంటలో పొటాషియం లోపం ఉన్నట్టు గుర్తించారు. ఆఖరి దఫా ఎరువులు వేసేటప్పుడు ఎకరాకు 20 నుంచి 25 కిలోల పొటాషియం వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడిఏ రామారావు, సర్పంచ్ కరణం రెవెన్యూ నాయుడు, ఎంపీటీసీ సభ్యులు మిద్దె రాజా చందర్రావు, అగ్రి అడ్వైజర్ బోర్డ్ చైర్మన్ కెవిఎస్ సన్యాసినాయుడు, రైతులు పాల్గొన్నారు.
పంట నమోదు రైతుల జాబితా ప్రదర్శన
యలమంచిలి : ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ కర్షక్ యాప్‌లో పంట నమోదు చేసిన వివరాలను ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ ప్రదర్శించడం జరిగిందని వ్యవసాయాధికారి సత్యశ్యామల శనివారం తెలిపారు. సోమలింగపాలెం రైతు భరోసా కేంద్రంలో రైతుల జాబితా ప్రదర్శించారు. వాటిలో తప్పులేమైనా ఉంటే సరిచేసుకోవాలని ఆమె రైతులకు సూచించారు. మార్పులు ఏమైనా ఉంటే ఆయా కేంద్రాల పరిధిలోని వ్యవసాయ సహాయకుల సహకారం తీసుకోవలసిందిగా ఆమె కోరారు. కార్యక్రమంలో ఏఇఒ దేముడు తదితరులు పాల్గొన్నారు.
పంట నమోదు జాబితాను ప్రదర్శించాలి
వడ్డాది : పంట నమోదు చేసుకున్న రైతుల జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జిఎస్‌ఎన్‌ఎస్.లీలావతి ఆదేశించారు. మండలంలోని మంగళాపురం, విజయవరామరాజుపేట రైతు భరోసా కేంద్రాలను శనివారం ఆమె సందర్శించారు. ఈ-పంట నమోదు చేసుకున్న రైతులు ముసాయిదా జాబితాలను తనిఖీ చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న జాబితాలను పరిశీలించారు. పంట నమోదులో తేడాలుంటే గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈనెల 31 లోగా తమ అభ్యంతరాలను తెలపవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఏడిఓ వి రవీంద్రనాథ్, వ్యవసాయ అధికారి బి.భాస్కరరావు విజయరామరాజుపేట సర్పంచ్ యల్లపు విజరు కుమార్, ఎంపీటీసీ కోరుమిల్లి బాలకృష్ణ మంగళపురం సర్పంచ్ కంటే వెంకట పద్మరేఖ, ఎంపీటీసీ పట్టి అప్పల నర్సా తదితరులు పాల్గొన్నారు.










