* మందకొడిగా ఖరీఫ్ సాగు
* వర్షాభావంతో ఆలస్యమవుతున్న నాట్లు
* వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రైతులు తాము పండించిన పంటలకు ఈ-క్రాప్ చేయించుకోవాలని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ రాయితీలు, పంట నష్టపరిహారం, పంట విక్రయం వంటి ప్రయోజనాలను రైతులు పొందుతారని చెప్పారు. ఈ ఏడాది ఈ-క్రాప్ బుకింగ్‌లో ప్రభుత్వం కొత్త మార్పు తీసుకొచ్చిందని తెలిపారు. గతంలో రైతు సాగు చేసిన పంటకు మాత్రమే ఫొటో అప్‌లోడ్ చేయగా, కొత్త విధానంలో పొలంలో రైతు ఉంటుండగా ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. వర్షాభావం కారణంగా ఖరీఫ్ సాగు మందకొడిగా ఉందన్నారు. పలు అంశాలను 'ప్రజాశక్తి' ముఖాముఖిలో వెల్లడించారు.
ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ ఎలా సాగుతోంది?
ఖరీఫ్ సీజన్‌లో సాగు చేస్తున్న ప్రతి పంటకు ఈ-క్రాప్ చేయించుకోవాలి. ఈ-క్రాప్ నమోదు కాకుంటే ప్రభుత్వ రాయితీలు పొందడానికి, పంటను అమ్ముకునేందుకు వీలు కాదు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలి. వ్యవసాయశాఖ మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో గ్రామ సచివాలయాల్లో ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ చేపడుతున్నాం.
పంట నమోదుకు జియోట్యాగింగ్ విధానం అమలు చేస్తున్నారా?
ఈ ఏడాది ఈ-క్రాప్ బుకింగ్‌లో ప్రభుత్వం కొత్త మార్పు తీసుకొచ్చింది. గతంలో రైతు సాగు చేసిన పంటకు మాత్రమే ఫొటో అప్‌లోడ్ చేయగా, కొత్త విధానంలో పొలంలో రైతు ఉంటుండగా ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పంటల కొనుగోలు, ఇతర ప్రయోజనాలన్నీ నిజంగా సాగు చేస్తున్న రైతులకే దక్కాలనే ప్రభుత్వం జియోట్యాగింగ్ విధానం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం పంటతో పాటు పొలంలో రైతు ఉన్నట్లు ఫొటో తీసి జియోట్యాగింగ్ చేస్తున్నాం.
జిల్లాలో ఖరీఫ్ పనులు ఎలా సాగుతున్నాయి?
ఖరీఫ్ సీజన్ మొదలైన తర్వాత పూర్తిస్థాయిలో వర్షాలు కురవలేదు. గత నెలాఖరులో కురిసిన వర్షాల వల్ల సాగు అనుకూల పరిస్థితులు మెరుగయ్యాయి. ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో నాట్లు వేయడం ఆలస్యమవుతోంది. వంశధార, నాగావళి నదీ పరివాహక మండలాలతో పాటు వాగులున్న చోట ఉబాలు ప్రారంభమయ్యాయి. ఈ నెలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. దీంఓ ఈ నెలాఖరుకు నాట్లు పూర్తయ్యే అవకాశముంది.
ప్రాజెక్టు ద్వారా సాగునీటి లభ్యత ఎలా ఉంది?
వంశధార కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని ఇప్పటికే విడుదల చేశారు. ఎడమ కాలువ ద్వారా నాలుగు వేల క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. దీనివల్ల కాలువ ఆయకట్టు పరిధిలో నాట్లు వేసుకునేందుకు వీలవుతోంది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు పూర్తయ్యాయి. నాగావళి నదిలో తోటపల్లి ఆయకట్టు, మడ్డువలస ఆయకట్టుకు, నారాయణపురం కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ పనులు సాగుతున్నాయి.
శివారు, వర్షాధార భూముల్లో నాట్లు వేసుకునేందుకు సాగునీరు అందని పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాల్లో నాట్లు కొంత ఆలస్యమవుతున్నాయి. నీరు అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతాల్లోనూ వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి.
రైతుభరోసా కేంద్రాల్లో ఎరువులు ఎంతమేరకు సిద్ధం చేశారు?
జిల్లాలో ఈ ఏడాది 10,063 మెట్రిక్ టన్నుల యూరియా, 2,999 మెట్రిక్ టన్నుల డిఎపి, 1835 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 398 మెట్రిక్ టన్నుల సూపర్ ఫాస్పేట్, 950 మెట్రిక్ టన్నుల పొటాష్ సిద్ధంగా ఉన్నాయి. డీలర్ల వద్ద అదనంగా 16,245 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. నానో యూరియా 1,554 లీటర్లు రైతుభరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంది.
అన్ని మండలాల్లో ప్రస్తుతం ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలతో పాటు ప్రాథమిక సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖల పరిధిలో ఎరువులను అందుబాటులో ఉంచాం.
రైతులకు సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయా?
జిల్లాలోని వ్యవసాయ, అనుబంధ సంస్థల రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. తక్కువ ఖర్చుతో పంటలను సాగు చేసుకునేందుకు యాంత్రీకరణ అవసరం. వరినాట్లు యంత్రంతో ఉడుపు, రోటరీ ఫీడరుతో గాబుతీత, డ్రోన్లతో పురుగులు, తెగుళ్ల మందులు పిచికారీ, కంబైన్డ్ హార్వెస్టర్‌తో వరి కోతలు వంటి ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని వినియోగించుకుంటే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. వరి వంగడాలతో పాటు జొన్న, రాగి, కంది, మినుము, పెసర, చెరకు , ఇతర వాణిజ్య పంటలను వేసుకోవడం ద్వారా రైతుకు మేలు చేకూరుతుంది. ఆదాయం పెరుగుతుంది.










