ప్రజాశక్తి-పంగులూరు: రబీ ఈ క్రాప్ (2022-23కు సంబంధించి)లో ఏమైనా సమస్యలు ఉంటే, వెంటనే ఆర్‌బికెలలో ఫిర్యాదు చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మండలంలోని కొండమూరు గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో రబీ 2022-23కు సంబంధించి ఈక్రాప్ సోషల్ ఆడిట్ లిస్టు ఈ నెల 13వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో ఉంచామని తెలిపారు. గ్రామసభలో ఈ క్రాప్ లిస్టులో ఉన్న పేర్లు, ఈ క్రాప్ వివరాలు గ్రామ సభలో చదివి వినిపించారు. లిస్టులో ఏమైనా సమస్యలు ఉంటే రైతులు రైతు భరోసా కేంద్రంలో ఫిర్యాదు చేస్తే, వెంటనే సరిచేస్తామని చెప్పారు. ఈ అవకాశం ఈ నెల 25వ తేదీ వరకు ఉందని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అంజిరెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకుడు జాగర్లమూడి దినేష్, పలువురు రైతులు పాల్గొన్నారు.










