అనంతపురం ప్రతినిధి : ఈ-కెవైసికి ఇంకా 20 వేల మంది రైతులు దూరంగా ఉన్నాయి. ఈ-క్రాప్ బుకింగ్ కూడా ఇంకా జరగాల్సి ఉంది. ఈ-కెవైసి మాత్రం 93 శాతమే పూర్తయింది. శుక్రవారంతో నమోదు గడువు కూడా ముగియనుంది. మిగిలిపోయిన వారికి ప్రభుత్వ సహాయం ప్రశ్నార్థకమే అయ్యే సూచనలున్నట్టు సమాచారం. ఈ-క్రాప్, ఈ-కెవైసి రెండూ ఉంటేనే రైతులకు పంటలబీమా అయినా, నష్ట పరిహారమైనా, రైతు భరోసా అయినా వస్తుంది. అవి లేకపోతే రైతులకు ప్రభుత్వ సహాయం అందటం ప్రశ్నార్థకం. ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలు సైతం ఇచ్చింది. ఈ మేరకు ఈ ప్రక్రియ గత కొంతకాలంగా నడుస్తూ వచ్చింది. ఒక్క రోజుల్లో ఏడు శాతం పూర్తి చేయడం సాధ్యమవుతుందా అన్నది చూడాల్సి ఉంది.
అనంతపురం జిల్లాలో 3.86 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ-క్రాప్ బుకింగ్ 3.59 లక్షల ఎకరాలు మాత్రమే జరిగింది. ఇప్పటికి 93 శాతం పూర్తయింది. రైతులకు సంబంధించి ఈ-కెవైసి ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. మొత్తం రైతులు 2,63,198 మంది రైతులుంటే.. 2,42,906 మంది రైతులు ఈ-కెవైసి చేసుకున్నారు. 20 వేల మంది రైతులు ఇంకా ఈ-కెవైసి చేసుకోవాల్సి ఉంది. రెండు కలిపి 93 శాతం పూర్తయింది. శింగనమల, విడపకల్లు మండలాల్లో 89 శాతమే పూర్తయ్యింది. కళ్యాణదుర్గం మండలంలో 90 శాతం మాత్రమే పూర్తయ్యింది. బుక్కరాయసముద్రం, బ్రహ్మసముద్రం, గుత్తి మండలాల్లో 91 శాతమే పూర్తయ్యాయి. అనంతపురం మండలంలో 99.7 శాతం అత్యధికంగా నమోదయిన మండలంగా ఉంది.
అమల్లో సాంకేతిక సమస్య, చేతివాటాలు
అమల్లోకి సాంకేతిక సమస్యలున్నాయి. కొన్ని ఉత్పన్నమవుతుండగా, కొన్ని చోట్ల చేతివాటం నడుస్తున్నట్టు ఆరోపణలున్నాయి. బీమా, నష్ట పరిహారం, రైతుభరోసా అన్ని రకాల సహాయం అందటానికి ఇదే కీలకం కావడంతో ఇవి పూర్తి చేయాలంటే తమకు కొంత ముట్టజెప్పాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. రూ.500 నుంచి వెయ్యి రూపాయలకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక కొన్ని చోట్ల మాత్రం సాంకేతిక సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా వరి పంట నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంట మధ్యలోకెళ్లి ఈ-క్రాప్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. వెళ్లకుండా గట్టుపై నుంచి బుకింగ్ చేస్తే సక్రమంగా నమోదవనట్టు తెలుస్తోంది.
తదుపరి ప్రక్రియ :
నేటితో ఈ-క్రాప్, ఈ-కెవైసి నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఈనెల 15 నుంచి 19వ తేదీన వరకు సోషియల్ ఆడిట్, గ్రామ సభలు నిర్వహిస్తారు. ఈనెల 23వ తేదీన సోషియల్ ఆడిట్ ఫిర్యాదులు పరిష్కరించబడును. ముసాయిదా జాబితాను ఈనెల 25వ తేదీన రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నారు.










