Jan 30,2022 12:38

మనుషులు ఇప్పుడు కొత్తగా కనబడుతున్నారు
తలలులేని మొండాల్లా మౌనంగా కదిలిపోతున్నారు
సమాజంలో ఇప్పుడు జనసమూహాలేవీ
కానరావట్లేదు
నిశ్శబ్దంగా నిర్జీవంగా నిద్రపోయే స్మశానాలను తలపిస్తోంది
కాంక్రీటు గుళ్లలో కంప్యూటర్ల తెరలు ముందు
సరీసృపాల్లా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు
అయినవాళ్లతో కన్నా అపరిచితులతోనే అనుబంధాలెక్కువ
సొంతిళ్లలో కన్నా నెట్టిళ్లలోనే అనుక్షణం కాలక్షేపం
రాత్రీపగలూ పనిచేస్తూ కాలానికి
ఖరీదు కడుతున్నారు
మానవ సంబంధాలకన్నా
మనీ సంబంధాలకే విలువిస్తున్నారు
సుఖభోగాల కోసం డిజిటల్‌ లోకాల్లో విహరించేవాళ్లే కానీ
కన్నీళ్లు కష్టాలు కడగళ్లు పంచుకునేవాడే లేడు

లైకులతోనే జీవితాలను లెక్కగడుతున్నారు
కామెంట్లు పెట్టడంతోనే
జీవితం కాస్తా గడిచిపోతుంది
అభినందనలు పరనిందలు
పరామర్శలన్నీ ఫేస్‌బుక్కుల్లోనే
పలకరింపులు పెళ్లిచూపులు
పెదవి విరుపులు అన్నీ వాట్స్‌యాప్‌లలోనే
అంతర్జాలపు వలలో చిక్కుకొన్న చేపపిల్లల్లా విలవిల్లాడుతున్నారు
అద్దాల పెట్టెలో అమ్మకానికి పెట్టిన ఆటబొమ్మల్లా మిగిలిపోతున్నారు
ఆన్‌లైన్‌ సాలెగూళ్లలో చిక్కుకుని
బయట పడలేకపోతున్నారు
అదే లోకం అనుకొని
మెదడు లేని మృగాల్లా
మిగిలిపోతున్నారు
 

ఈదర శ్రీనివాసరెడ్డి
78931 11985