Aug 21,2021 06:32

    మార్కెట్‌కు ఖరీఫ్‌ ఉల్లి ఉత్పత్తుల రాక మొదలైందో లేదో అప్పుడే గిట్టుబాటు ధర దొరక్క రైతు కంట కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. బోర్ల కింద ముందస్తుగా సాగు చేసిన పంట పది రోజులుగా రోజుకు 200 టన్నులు కర్నూలు మార్కెట్‌కు తెస్తుండగా కొనుగోళ్లు లేక, అరకొరగా జరిగిన కొనుగోళ్లలో సరైన ధర పడక రైతులు పడుతున్న అవస్థలు చెప్పనలవి కాదు. ప్రతి సంవత్సరం వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్ల దోపిడీకి ఉల్లి రైతులు గురవుతుండగా, ఈ మారు దానికి కేంద్రం బలవంతంగా రుద్దిన 'ఇ-నామ్‌' పద్ధతి తోడైంది. దోపిడీని మరింత విస్తృతం చేసింది. ఇ-నామ్‌లో ధరలు ఇంతకుముందు కంటే కూడా దిగజారడంతో రైతులు ఆ పద్ధతి వద్దని ఎదురు తిరిగారు. రైతుల సమస్యను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఇ-నామ్‌కే సై అనడంతో పాటు ఆ ప్రక్రియ మొదలయ్యే వరకు సరుకును మార్కెట్‌కు తీసుకురావద్దని ఆంక్షలు విధించింది. అందుకు ఆగ్రహించిన రైతులు గురువారం రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం 'ఇ-నామ్‌' పట్టు వీడట్లేదు. బహిరంగ వేలంలో క్వింటాలు నాణ్యతను బట్టి రూ.900-1,400-1,800 వరకు రైతుకు పడుతుండగా, ఇ-నామ్‌లో రూ.150-700-1,000 దక్కడం కనాకష్టమవుతోంది. ఇదేమీ పట్టించుకోకుండా తాము అనుకున్న పద్ధతిలోనే ఉల్లి కొనుగోళ్లు జరగాలని ప్రభుత్వం మొండిపట్టు పట్టడం రైతులకు మేలు చేసినట్లు ఎలా అవుతుంది ?
   'ఒకే దేశం - ఒకే మార్కెట్‌' పేరుతో 2016లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌-నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఇ-ఎన్‌ఎఎమ్‌)ను ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్‌లో పంటల కొనుగోళ్లు జరుగుతాయి. ఇ-నామ్‌లో లైసెన్స్‌లు తీసుకున్న వ్యాపారులు రైతుల ఉత్పత్తులకు నాణ్యతను బట్టి ధరలు కోట్‌ చేస్తారు. ఎవరు ఎక్కువ ధర కోట్‌ చేస్తే వారికి రైతులు తమ పంటలను అమ్ముకోవచ్చు. రైతులకు పారదర్శకత, గిట్టుబాటు ధర పొందే అవకాశం కల్పించడమే ఇ-నామ్‌ లక్ష్యమంటోంది కేంద్రం. వాస్తవానికి వాల్‌మార్ట్‌, రిలయన్స్‌ వంటి కార్పొరేట్ల దోపిడీకి ఈ పద్ధతి బాగా తోడ్పడుతుంది. రాష్ట్రాలు తమ మార్కెటింగ్‌ చట్టాలను, నిబంధనలను సవరించి తప్పనిసరిగా అమలు చేయాలని ఒత్తిడి చేస్తోంది కేంద్రం. లేకపోతే సెంటర్‌ మార్కెట్‌ ఫండ్‌ సహా పలు పథకాల నిధులు ఇవ్వబోమని షరతులూ విధించింది. కేంద్రం బలవంతానికి తలొగ్గిన రాష్ట్రం దశలవారీగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) లేని వాణిజ్య పంటలను ఇ-నామ్‌ కిందకు తీసుకొస్తోంది. నిరుడు పసుపు, మిర్చికి అమలు చేసిన సర్కారు ఈ ఏడాది ఉల్లికి తప్పనిసరి చేసింది.
     కరోనా సంక్షోభంలో సైతం తన నయా-ఉదారవాద విధానాలను అమలు చేసే క్రమంలో కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు 'ఇ-నామ్‌' రిహార్సల్‌ వంటిది. ఇప్పుడే అటు రైతులకు ఇటు వినియోగదారులకు రెండు వైపులా నష్టం వాటిల్లుతోంది. పంట పండించిన ఉల్లి రైతుకు క్వింటాలుకు రూ.500 కూడా రావట్లేదు. అదే వినియోగదారులకు కిలో రూ.30కి పైమాటే. ప్రభుత్వ విధానాల అండ, మద్దతు లేకుండా రైతులకు, ప్రజలకు ఈ దుస్థితి దాపురించిందనుకోగలమా? వ్యవసాయ చట్టాలు అమల్లోకొస్తే కార్పొరేట్లు నేరుగా రైతులతో ఒప్పందాలు చేసుకొని, ముందే ధరలు నిర్ణయించేసుకొని, మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి రైతులను, వినియోగదారులను ఇంకా ఇంకా దోచుకుంటారు. చిన్న వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్ల వ్యవస్థ పోయి బడా బేహారుల కూటమి తయారవుతుంది. తమది రైతు పక్షపాత రాజ్యమంటున్న వైసిపి, పంట వేసే ముందే ధరలు నిర్ణయిస్తామంది. మార్కెట్‌ ఒడుదుడుకులపై అంచనాకు ఇంటెలిజెన్స్‌ అంది. వ్యవసాయ మిషన్‌, సలహా బోర్డులు వేసింది. ధరలు తగ్గినప్పుడు మార్కెట్‌లో జోక్యం చేసుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి అనీ పేర్కొంది. ఇవేవీ మార్కెట్‌ మాయాజాలం నుండి రైతులను రక్షించలేకపోతున్నాయి. మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లయీస్‌ వంటి ప్రభుత్వ సంస్థలను ఉల్లి కొనుగోళ్లకు రంగంలోకి దించి రైతులను ఆదుకోవాల్సింది పోయి కేంద్రం చెప్పినట్లు ఇ-నామ్‌ పాట పాడటం ఢిల్లీకి జీహుజూర్‌ అనడమే. తీరు మార్చుకోకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక రైతుల ఆగ్రహానికి గురవుతాయి. ఈ ఉదంతం ఢిల్లీలో నెలల తరబడి పోరాడుతున్న రైతు సంఘాల ఉద్యమం ఎంత ప్రాధాన్యత కలిగి ఉందో మనకు ప్రాక్టికల్‌గా తెలియజేస్తోంది. రాష్ట్రంలోని రైతన్నలంతా మేల్కొని కదలాల్సిన తరుణం ఇది.