ప్రజాశక్తి-గుంటూరు : క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ ఈ-ఆటోలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారని రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి వై.శ్రీలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా రాష్ట్రంలో ఇంటింటి చెత్తను తడిపొడిగా వేరుగా సేకరించటానికి 516 ఈ-ఆటోలను ప్రభుత్వం అందించిందని, ఈ-ఆటోలను సిఎం ప్రారంభించిన తర్వాత శుక్రవారం నుండి ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల వార్డ్ సచివాలయాల వారిగా ఈ-ఆటోలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తద్వారా మెరుగైన ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం చేయడానికి అవకాశం కల్గుతుందన్నారు. ఇప్పటికే ప్రజారోగ్య కార్మికులకు దశల వారీగా ఆటోల డ్రైవింగ్ శిక్షణ ఇచ్చామని, ఈ-ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎమ్‌డి, సిడిఎంఎ, జిల్లా కలెక్టర్, విజయవాడ, మంగళగిరి-తాడేపల్లి కమిషనర్లకు విధులు కేటాయించినట్లు తెలిపారు.










