Aug 22,2021 06:25

    రెండు సంవత్సరాలుగా ప్రేమించి అక్టోబర్‌ నెలలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అనుమానంతో విజయనగరం జిల్లాలో తగలబెట్టాడొకడు. అభం శుభం తెలియని దళిత చిన్నారిపై గుంటూరులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు వరుసకు మామ అయిన ప్రబుద్ధుడు. దిశ చట్టం అమలు గురించి ఎంతో ఆర్భాటంగా చెప్పుకునే రాష్ట్రంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగా ఇంజినీరింగ్‌ చదువుతున్న రమ్య అతి దారుణంగా హత్యకు గురికావడం అందరిని కలచివేసింది. నిర్భయ, దిశ, అశ్లీలత వ్యతిరేక చట్టాలు ఎన్ని వచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలను, ప్రేమోన్మాదుల దాడులను, యాసిడ్‌, లైంగిక దాడులను నివారించలేక పోతున్నాయి. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గ్రహిస్తే మంచిది.
    రోజు రోజుకు పేట్రేగిపోతున్న అశ్లీల సినిమాలు, సాహిత్యం, ప్రకటనలను ప్రభుత్వాలు కట్టడి చేయలేకపోతున్నాయి. కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాయి తప్ప చేసిందేమీ లేదు. దిశ చట్టం అమలు లోకి వచ్చిన సంవత్సరం లోనే దాదాపు ఆరుగురు ఇంజినీరింగ్‌ చదివే అమ్మాయిలు హత్యకు గురయ్యారంటే... వార్తలకందని, నిరక్షరాస్యులైన మహిళలు ఎందరో ?
     మహిళలపై హింస అనేది సామాజిక, ఆర్థిక, అభివృద్ధి... విద్య, మానవ హక్కులు, చట్టాలు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. మహిళలపై హింసకు మానసిక అనారోగ్యానికి మధ్య గల సంబంధాన్ని తగినంతగా పరిశోధించలేదు. ఇంటర్నెట్‌ పుణ్యమా అని పోర్నోగ్రఫీ ఇంట్లోనే తిష్టవేసుకుని కూర్చుంది. కరోనా పుణ్యమా అని అన్ని ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న ఈ తరుణంలో సమస్య విపరీతంగా పెరిగిపోయింది. భారతదేశంలో ప్రత్యేకంగా ఏ చట్టంలోనూ అసభ్యత, అశ్లీలత నిర్వచించబడలేదు. కానీ భారతీయ శిక్షాస్మృతి-1860, సమాచార సాంకేతిక చట్టం-2000 ప్రకారం...అశ్లీలత, అశ్లీలతతో కూడిన వాటిని ప్రచురించడం, ప్రసారం చేయడం... అసభ్యకర, అశ్లీల వస్తువులను విక్రయించడం వంటివి శిక్షార్హమైన నేరాలు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, లైంగిక దాడులను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దిశ చట్టాన్ని రూపొందించింది. అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ ఇవ్వాలి.
      ప్రభుత్వం ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా, చుట్టూ ఉన్న సమాజం, మనుషులలో మార్పు రానిది ప్రయోజనం లేదు. ఈ రోజు సామజిక మాధ్యమాల ద్వారా మంచి కంటే చెడును ఎక్కువ ఆకళింపు చేసుకొని ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఉపాధి లేకుండా యువతను నిర్వీర్యం చేసిన ఘనత మన పాలకులది. ఇంజినీరింగ్‌ చదివిన వారిలో తొంభై ఐదు శాతం మందికి ఉద్యోగాలు లేవు. ప్రయివేటు రంగంలో పని చేసే వారికి అరవై శాతం మందికి జీతాలు లేవు. తొంభై శాతం ప్రజలు అభద్రతా భావంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఇలాంటి దారుణాలకు కొదవ లేకుండా పోయింది.
     ప్రజలకు నాణ్యమైన విద్య, సంస్కృతి, మానవ విలువలు, పర్యావరణం, మంచి ఆరోగ్య ఆహారపు అలవాట్ల గురించి చెప్పే విద్యాసంస్థలు కరువయ్యాయి. కేవలం డబ్బే పరమావధిగా కార్పొరేట్‌ కళాశాలలు, విద్యా సంస్థలు ఏర్పడి నడుస్తున్నాయి. వీటి మాయాజాలంలో పడిన తల్లిదండ్రులకు సమాజం గురించి పట్టడం లేదు. తమ పిల్లలకు మంచి ప్లేస్‌మెంట్‌ వచ్చి ఎక్కువ డబ్బు సంపాదిస్తే చాలు అనుకునేలా తయారవుతున్నారు. పరిస్థితులు ఈ విధంగా ఉన్నంతవరకు మహిళలపై దాడులను అరికట్టడం అంత సులభం కాదు.
 

- డా|| యం.సురేష్‌ బాబు,
రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా సైన్సు వేదిక.