ఓట్ల జాతర ముందు
మా అవసరం నువ్వు
అందలం ఎక్కించే నిచ్చెనవు కదా
ఎన్నికల పందేరం ముగిసాక
మా జెండా వేరు, ఎజెండా కూడా వేరే!
అధికార పీఠం అధిరోహించాక
ఆదర్శాలన్నీ తారుమారు
అసమ్మతి స్వరం దేశద్రోహం
లౌకిక తత్వం ప్రతిపక్ష అరాచకత్వం
సమ సమాజం విదేశీ కుట్ర
విద్వేష ప్రసంగాలతో
భావోద్వేగాల వలయాల్లో చిక్కుకున్న జనం
సోషల్ మీడియాలో కూర్చుని
పోరాడే వర్చువల్ దేశభక్తులు
మెజారిటీ, మైనారిటీ బుజ్జగింపు రాచకీయాలు
మా పురోగమనానికి సోపానాలు
జాతి సంపద మొత్తం అంగట్లో అమ్మకపు సరుకు
శ్రమజీవుల ఘర్మజలం సర్వం కార్పొరేట్ పూజకు అభిషేకం
మా రాచకీయ చదరంగాన కొత్త ఎత్తుగడ ఇదే !
ఏకతా శిల్పాల రూపకల్పన మా అభివృద్ధి ఎజెండా
మందిరాలు, మసీదులు ఓట్లు రాల్చే కల్ప తరువులు
రేపటి మా గెలుపుకు రహదారులు
ఎవరూ భుజాలు తడుముకోకండి
ఇది సార్వజనీన సూత్రం
మాది సర్వజనుల గళం !
- వినిశ్రీ
97013 48825