Aug 03,2021 08:53

హైదరాబాద్‌ : నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు తొలి సమావేశం జరగనుంది. కానీ దీనికంటే ముందుగా పూర్తిస్థాయి బోర్డు మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని జిఆర్‌ఎంబి సభ్య కార్యదర్శికి తెలంగాణ ఈఎన్‌సి లేఖ రాయడంతో సమావేశంపై సందిగ్ధం నెలకొంది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీచేసింది. అక్టోబర్‌ 14 నుంచి ఈ నోటిఫికేషన్‌ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో... కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు పూర్తిచేయాల్సిన కార్యాచరణపై కసరత్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి రెండుబోర్డులు సమన్వయ కమిటీ తొలిసమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశాయి.
      బోర్డులకు సంబంధించిన ఉద్యోగుల నియామకం, ఆర్గనైజేషనల్‌ స్ట్రక్చర్‌పై దృష్టి పెట్టాలన్న సూచనల మేరకు... కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశాలను నిర్వహించాలని జిఆర్‌ఎంబి, కెఆర్‌ఎంబి నిర్ణయించాయి. ముందుగా బోర్డు మీటింగ్‌ను నిర్వహించాలని తెలంగాణ కోరగా, ఆ లేఖపై స్పందించిన జిఆర్‌ఎంబి... నోటిఫికేషన్‌ అమలుకు నిర్ధిష్ట గడువులతో తక్షణ కార్యాచరణను ఖరారు చేయాలని కేంద్ర జలశక్తిశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని తెలిపింది. కార్యాచరణపై చర్చించి తగిన చర్యలు తీసుకున్న తర్వాత.. బోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని జిఆర్‌ఎంబి పేర్కొంది.