Jul 30,2021 08:48

జీడిమెట్ల (హైదరాబాద్‌) : అందంగా ఉండి ఆభరణాలతో ఒంటరిగా కనబడే మహిళలే వారి టార్గెట్‌.. పని ఉందని నమ్మించి ఆలయానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన తర్వాత ఆమె జననాంగాలపై కర్రతో బాది కర్కశంగా చంపిన సహజీవన జంట పైశాచికత్వం జీడిమెట్లలో వెలుగుచూసింది. ఆ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
     గురువారం షాపూర్‌నగర్‌లోని బాలానగర్‌ డిసిపి కార్యాలయంలో డిసిపి పద్మజ మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా ఐడిఎ బల్లారం వైఎస్‌ఆర్‌ కాలనీలో కురువ స్వామి అలియాస్‌ రవి, మసనమొల్ల నర్సమ్మ సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 25 న ఇద్దరూ మల్లంపేట లేబర్‌ అడ్డాకు వెళ్లారు. అక్కడ మల్లంపేటకు చెందిన ఓ మహిళ (37) పని కోసం ఎదురుచూస్తుంది. ఆమె అందంగా ఉండి ఆభరణాలను ధరించి కనబడటంతో స్వామి, నర్సమ్మ లు ఆమెతో మాట్లాడి పని ఉందని చెప్పారు. ఆలయం వద్ద సున్నం వేయాలని, రూ.700 ఇస్తారని నమ్మించి ఆమెను బైక్‌పై తీసుకెళ్లారు. జిన్నారం మండలం అంకిరాల గుట్టల్లోకి తీసుకెళుతుండగా... ఆమెకు అనుమానం వచ్చి ప్రశ్నించింది. కొండపై ఆలయం ఉందని చెప్పి అక్కడికి వెళ్లాక స్వామి ఆమెను లోబర్చుకునే యత్నం చేశాడు. ఆమె భయాందోళనతో కేకలు వేసింది. నర్సమ్మ.. ఆ మహిళను కదలకుండా పట్టుకోవడంతో అతడు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వారిద్దరూ కిరాతంగా మహిళ జననాంగాలపై కర్రతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె చనిపోయింది. అనంతరం మహిళ మెడలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకొని ఇద్దరూ పరారయ్యారు.

భర్త ఫిర్యాదుతో వెలుగుచూసిన దారుణం...
పనికి వెళ్లిన తన భార్య ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ దారుణం వెలుగుచూసింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మల్లంపేట లేబర్‌ అడ్డా నుంచి ఇద్దరు ఆ మహిళను బైక్‌పై తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితులను గుర్తించారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా గాగిల్లాపూర్‌ లేబర్‌ అడ్డా వద్ద నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ నెలలోనే నాలుగు దొంగతనాలు జరిగినట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద నుండి రూ.2 లక్షలు విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కిరాతక జంట ఇంతవరకు ఎలాంటి దారుణాలకు పాల్పడ్డారు ? ఎన్ని అఘాయిత్యాలు చేశారు ? అనే విషయాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.