హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు జడ్జి పొట్లపల్లి కేశవరావు (60) సోమవారం కన్నుమూశారు. గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. జస్టిస్ పి.కేశవరావు మృతితో రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులకు సోమవారం సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్టర్ జనరల్ ఆధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ కేశవరావు అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2017 సెప్టెంబర్ 21 నుంచి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా కేశవరావు సేవలు అందించారు.
సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం..
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. జస్టిస్ కేశవరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
ప్రముఖుల సంతాపం..
తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌తో పాటు పలువురు ప్రముఖులు జస్టిస్ కేశవరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... చాలా సాధారణ జీవితం గడిపిన కేశవరావు మంచి విలువలున్న మానవతావాది అని కొనియాడారు. కేశవరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.