- 36 బోట్లు పూర్తిగా, 9 పాక్షికంగా దగ్ధం
- సుమారు రూ.15 కోట్లు ఆస్తి నష్టం
- బోట్ల విలువలో 80 శాతం నష్టపరిహారం : సిఎం ఆదేశం
- బాధిత మత్స్యకారులను పరామర్శించిన పలు పార్టీల నేతలు
- అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖ), గ్రేటర్ విశాఖ బ్యూరో, అమరావతి బ్యూరో : విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 36 బోట్లు పూర్తిగా, తొమ్మిది బోట్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. వీటిలో మెకనైజ్డ్ బోట్లు కూడా ఉన్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లి వచ్చిన బోట్లను చేపల రేవులోని జెట్టీల వద్ద మత్స్యకారులు నిలిపి ఉంచారు. ఆదివారం అర్ధరాత్రి మొదట వీటిలో ఒక బోటుకు నిప్పు అంటుకుని పక్కపక్కనే ఉన్న బోట్లుకు ఆగ్ని కీలలు వేగంగా వ్యాపించడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో గాలులు అధికంగా వేయడం, వేలాది లీటర్ల డీజిల్, గ్యాస్ సిలిండర్లు బోట్లలో ఉండడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉంది. పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. హఠాత్తు ఘటనతో మత్స్యకారులు హడలిపోయారు. వారు హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అగ్నిమాపక అధికారులు, నేవీ సిబ్బంది ఐఎన్‌ఎస్ సహారా షిప్ ద్వారా నీళ్లుజల్లి త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టడంతో ఉదయం ఆరు గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో మొత్తం రూ.15 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని, ఒక్కో బోటు ఖరీదు రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో బోట్లలోని వలలు కూడా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ ఎ.రవిశంకర్ మాట్లాడుతూ, ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, తక్కువ స్థలంలో ఎక్కువ బోట్లు ఉండడం వల్లే ప్రమాదం భారీగా జరిగిందని తెలిపారు.
- ఆదుకోవాలంటూ మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన
తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతూ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడికి స్వయంగా వచ్చి పరిస్థితిని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీరు వల్ల ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో నష్టపరిహారం, రెండు నెలల పాటు ఉపాధి జీవనభృతి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- ప్రమాదంపై భిన్న కథనాలు
ఈ అగ్నిప్రమాదంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం రాత్రి కొంతమంది మత్స్యకార యువకులు హార్బర్‌లోని చేపల వేలం పాట వేసే ప్రదేశంలో మందు పార్టీ చేసుకున్నట్లు చర్చ సాగుతోంది. ఆరుగురు మందు తాగుతున్న క్రమంలో మాటామాటా పెరిగి కొట్లాడుకుని ఫిషింగ్ బోట్లను తగుల బెట్టారని ప్రచారం జరుగుతోంది. వీరిలో యూట్యూబర్ నాని కూడా ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని, యూట్యూబర్ దానిని వీడియో తీసే ప్రయత్నం చేశాడని చెబుతున్నారు. పూర్తి వివరాలు మంగళవారం నగర పోలీస్ కమిషనర్ వెల్లడిస్తారని పోలీసులు తెలిపారు. ఫిషింగ్ హార్బర్‌లో ఆకతాయిల ఆగడాలు కూడా నిత్యకృత్యంగా మారాయి. దీంతో, ఇక్కడి వ్యవహారాలపై గతంలో వన్‌టౌన్ ఏరియాలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన మహిళా అధికారి నిఘా పెట్టి అణచివేశారు. అనునిత్యం పెట్రోలింగ్ చేస్తూ ఎవ్వరినీ దగ్గరకు చేరనీయకుండా చూసేవారు. దీంతో, కొద్ది నెలల పాటు మందు పార్టీలు ఆగాయని తెలుస్తోంది. ఆమె బదిలీ కావడంతో గడిచిన నెల రోజులుగా ఆకతాయిలు చెలరేగిపోతున్నట్లు మత్స్యకార కుటుంబాలకు చెందిన పెద్దలు కొంతమంది 'ప్రజాశక్తి' వద్ద వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ గెలిచిన తర్వాత తమ సమస్యలేవీ పట్టించుకోవడం లేదని, బోట్లకు సరిపడా స్థలం కోసం విన్నవించినా ఫలితం లేకపోయిందని స్థానిక మత్స్యకార మహిళలు తీవ్ర స్థాయిలో శాపనార్థాలు పెట్టారు. ఈ ప్రమాదం వల్ల రూ.కోట్లలో నష్టం జరగడమే కాకుండా బోట్లపై ఆధారపడిన వందల మంది కుటుంబాలకు రెండు, మూడు నెలల పాటు వేట అవకాశం లేకపోవడంతో జీవనోపాధిపై తీవ్ర దెబ్బ తగలనుంది.
- ప్రమాదంపై అధికారులతో సిఎం సమీక్ష
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో బోట్లు కోల్పోయిన వారికి బోటు విలువలో 80 శాతాన్ని నష్టపరిహారంగా చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ ప్రమాదంపై తాడేపల్లిలో సిఎంఒ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. సమగ్ర విచారణ చేయాలని అధికారులను, ప్రమాదస్థలానికి వెళ్లి బాధిత మత్స్యకారులకు అండగా నిలవాలని మంత్రి సీదిరి అప్పలరాజును, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునను ముఖ్యమంత్రి ఆదేశించారు.
- రెండు, మూడు రోజుల్లో పరిహారం : మంత్రి సిదిరి అప్పలరాజు
సంఘటనా స్థలాన్ని మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు సోమవారం పరిశీలించారు. ఘటనకు కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు వేగవంతం చేశామని, అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే మత్స్యకారుల్లో ఇప్పుడు ఆందోళన నెలకొందన్నారు. అందరికీ ఒకేలా నష్టం జరగలేదని, జరిగిన నష్టంపై అధికారులు అన్ని విధాలా అంచనాలు వేస్తున్నారని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో నష్టపరిహారం అందేలా చర్యలు చేపడతామని తెలిపారు.
- పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలి : సిపిఎం
అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులను సిపిఎం, సిపిఐ, వైసిపి, టిడిపి, జనసేన పార్టీ, ఆప్ పార్టీల నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రతి బోటుకూ నూరు శాతం నష్టపరిహారం చెల్లించాలని, ఈ బోటుపై ఆధారపడిన కుటుంబాలతోపాటు దీని ఆధారంగా ఉపాధి పొందుతున్న సుమారు వెయ్యి కుటుంబాలకు ప్రభుత్వం కనీసం మూడు నెలల వరకు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. బోటు ఖరీదే కాకుండా బోటులో ఉండే సరుకు, డీజిల్, ఇతర సామగ్రిని కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల నివారణకు ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడం, సముద్రంలోని బోట్లను మంటల నుంచి రక్షించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. మెరైన్ పోలీస్ వ్యవస్థ లేకపోవడం, జెట్టీ విస్తరణ కాకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా గురువుల సంఘటనా స్థలాన్ని పరిశీలించి బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మత్స్యకారుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని, బోట్లకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని టిడిపి, జనసేన పార్టీ నాయకులు విమర్శించారు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం : ఎపి మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఎపి మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ విమర్శించారు. హుదూద్ తుపాను సమయంలో సుమారు 40 వరకు బోట్లు జెట్టీల సమీపంలో సముద్రంలో మునిగిపోయాయని, వీటిని తొలగిస్తే జెట్టీల వద్ద ఖాళీ ఏర్పడి బోట్లను దూరదూరంగా పార్కింగ్ చేసుకునే అవకాశం ఉండేదని తెలిపారు. బోట్లు దూరదూరంగా ఉంటే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదన్నారు. సముద్రంలో మునిగిపోయిన బోట్లను తొలగించాలని తాము అనేకసార్లు కలెక్టర్‌తో సహా ఉన్నతాధికారులను కోరామని, ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. సముద్రంలో మునిగి ఉన్న బోట్లను ఇప్పుడైనా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
- బోట్ల విలువలో 80 శాతం నష్టపరిహారం విచారణ చేపట్టాలి : పవన్ కల్యాణ్
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదంపై విచారణ చేపట్టాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు తక్షణమే జీవన భృతి అందించాలని, భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతాపరమైన అంశాలపై సమీక్షించి పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.