కొవ్వొత్తి తాను కరుగుతూ...తన చుట్టూ వెలుగునిస్తుంది. అచ్చంగా ఆమె కూడా అంతే. తాను కరుగుతూ...కుటుంబమంతటికీ వెలుగవుతుంది. అందుకేనేమో 'ఇల్లాలే ఇంటికి వెలుగు' అన్నారు. అన్నీ తానై చక్కబెడుతుంది. ఇంటిని సరైన దిశలో నడిపేందుకు క్షణం తీరికలేకుండా శ్రమించే చోదకశక్తి ఆమె. ఉదయం లేచింది మొదలు... రాత్రి పడుకునే వరకు విరామమెరుగక నడిచే గానుగ ఆమె. అయినా.. ఆమె ఏ పనీ చేయదు... ఇంట్లోనే వుంటుంది. హౌస్‌వైఫ్ అని పిలుచుకునే ఆమెకు సిసలైన అర్థం గృహిణి. భర్తతో సమానంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా... ఇంటిపని, వంటపని మాత్రం ఆమెదే. భర్తతో సమాన హోదాలో పనిచేస్తున్నా... సమాన వేతనం తీసుకొంటున్నా ఇంటి చాకిరీ ఏమీ తగ్గదు. పిల్లలకు, పెద్దలకు చేసే పనులేవీ శ్రమగా గుర్తింపబడవు. పైగా దానికి బాధ్యత అనే ఒక ట్యాగ్ లైన్ తగిలిస్తారు. మహిళలు కూడా ఇది మా బాధ్యతే అనో, మా తలరాత అనో సరిపెట్టుకు నేలా చిన్నప్పటి నుంచే వారిని ట్యూన్ చేస్తుందీ కుటుంబ వ్యవస్థ.
వండుతూ, వడ్డిస్తూ, తోముతూ, కడుగుతూ, సర్దుతూ... అన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ, వారి శ్రమకు గుర్తింపు ఇవ్వట్లేదు. స్త్రీని ఒక మనిషిగా కాకుండా, ఒక వస్తువుగా భావించే వంటింటి సంస్కృతిలో గృహిణి నిరంతరం శ్రమదోపిడీకి గురౌతూనే వుంది. స్త్రీలు చేసే ఇంటి శ్రమకు ముఖ్యంగా వంటింటి శ్రమకు విలువ, గౌరవం ఏనాడూ లేవు. కుటుంబమంతటికీ అహర్నిశలు వండి వార్చాల్సిందే. 'ఈ వంటింటిని తగలెయ్య/ ఎంత అమానుషమైందీ వంటగది/ మన రక్తం పీల్చేసి, మన ఆశల్నీ, కలల్నీ కాజేసి/ కొద్దికొద్దిగా జీవితాంతం పీక్కుతింటున్న/ రాకాసి గద్ద ఈ వంటిల్లు' అంటారు కవయిత్రి విమల. అంతర్జాతీయ కార్మిక సంస్థ 2019 నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 64 దేశాలలోని మహిళలు రోజువారీగా ఎలాంటి జీతం లేకుండా 1640 కోట్ల గంటలు పనిచేస్తున్నారు. ఈ శ్రమకు వేతనం చెల్లించాల్సి వస్తే... ఎంత పెద్ద మొత్తంలో చెల్లించాలో ఊహించుకోవాల్సిందే. ఒకవేళ ఆమె శ్రమకు వేతనం చెల్లించాల్సి వస్తే... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం-గృహిణుల శ్రమకు అత్యంత కనిష్టంగా వేతనం చెల్లించినా నెలకు రూ.22.7 లక్షల కోట్లు అవుతుందని వెల్లడించింది. అంతేకాదు... 81.2 శాతం మహిళలు ఎటువంటి వేతనం లేని ఇంటి చాకిరిలో నిమగమై వున్నారని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్-2020లో విడుదల చేసిన సర్వే చెబుతోంది. గృహ నిర్వహణ, పిల్లలు, వృద్ధుల సంరక్షణ, ఇతరత్రా పనుల కోసం వారానికి 34.6 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నట్లు 'జాతీయ సమయ వినియోగ సర్వే' చెబుతోంది. ఇది పురుషులు వెచ్చించే సమయం కంటే పది రెట్లు ఎక్కువ. ప్రభుత్వ గణాంకాల్లో పేర్కొనని, పురుషాధిక్యత గుర్తించలేని శ్రమ ఇది.
బాల్యం నుంచే అంచెలంచెలుగా వంటింటికి బానిసగా మారుస్తుందీ పితృస్వామిక వ్యవస్థ. భార్యగా, తల్లిగా, కోడలిగా...ఒక గృహిణిగా- ఆమె శ్రమ వెల కట్టలేనిది. ఎలాంటి కృతజ్ఞతకూ నోచుకోని 24/7 ఉద్యోగం ఇది. అయినా ఆమె ఇంటికి మహారాణి. ఆమె చేతితో మాత్రం చిల్లిగవ్వ కూడా వుండదు. 'ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి/ అయినా చివరకు వంటింటి గిన్నెలన్నిటిపైనా/ మా నాన్న పేరే!' అంటారు కవయిత్రి విమల. తల్లికీ- బిడ్డకీ మధ్య తరాలు మారుతున్నా...పురుషాధిక్య సమాజంలో వారి ఆలోచనా దృక్పథంలో ఎటువంటి మార్పు రావడంలేదన్నది నిత్యం మన కళ్ల ముందు జరుగుతున్న ఇంటింటి కథ. సామాజిక, కౌటుంబిక జీవిత ఇతిహాసపు చీకటి కోణంలోపడి మసిబారిపోయిన మాతృమూర్తుల జీవిత కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం. గృహిణులకు గుర్తింపుగా నవంబర్ 3వ తేదీని 'జాతీయ గృహిణుల దినోత్సవం'గా నిర్వహిస్తున్నారు. వారిని సత్కరించే రోజు ఇది. ఇది ఒక రోజుకు పరిమి తం కాకూడదు. ఉద్యోగిని అయినా, గృహిణి అయినా... ఆమె శ్రమలో భాగం పంచుకున్న రోజే నిజమైన సత్కారం. ఇంటా బయటా స్త్రీ పురుషు లిద్దరూ సమానమేనన్న చైతన్యం ఈ గృహిణుల దినోత్సవం కలిగించాలి.