Hockey player : రాష్ట్ర మహిళా సాధికారత, బాలల అభివృద్ధి విభాగం బ్రాండ్ అంబాసిడర్‌గా వందన కఠారియా

డెహ్రాడూన్ : భారత హాకీ ప్లేయర్ వందన కఠారియాను రాష్ట్ర మహిళా సాధికారత, బాలల అభివృద్ధి విభాగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఒక ప్రకటనలో తెలిపారు. సర్వే చౌక్‌లోని ఐఆర్‌డిటి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన తిలు రౌతేలి అవార్డ్‌తో పాటు అంగన్‌వాడీ వర్కర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఈ అవార్డుల కింద ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని కూడా రూ. 31 వేల నుండి రూ.51 వేలకు పెంచుతున్నట్లు సిఎం పేర్కొన్నారు. కాగా, హరిద్వార్ జిల్లాలోని రోషనాబాద్ గ్రామంలో ఉన్న వందన కఠారియా కుటుంబసభ్యులను ఉత్తరాఖండ్ క్రీడల మంత్రి అరవింద్ పాండ్యే కలిశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ శుభాకాంక్షలు అందించడంతో పాటు ఆమె తల్లిదండ్రులను సత్కరించారు. నేటి యువతకు వందన రోల్‌మోడల్‌గా నిలిచిందని, ప్రతి ఒక్కరూ ఆమె నుండి ప్రేరణ పొందాలని, రాష్ట్రం నుండి మరింత మంది క్రీడాకారులు రావాలని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ఒక విధానాన్ని అమలు చేసిందని, అలాగే క్రీడాకారులకు శిక్షణనిచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళా హాకీ టీమ్ అద్భుతమైన ప్రదర్శనలో ఉత్తరాఖండ్ అమ్మాయి వందన కఠారియా భాగస్వామ్యమవ్వడం గర్వకారణమని పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వందనకు రూ. 25 లక్షల రివార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.