Jul 27,2023 08:53

ప్రజాశక్తి-అమరావతి : టివి ప్రసారాలకు సెన్సార్‌ షిప్‌ ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. సెన్సార్‌షిప్‌ లేకుండా టివిల్లో అసభ్య, అభ్యంతరకర రీతిలో బిగ్‌బాస్‌ వంటి రియాల్టీ షోలు ప్రసారం అవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి టివి కార్యక్రమాలు ప్రసారాలకు సెన్సార్‌ చేయకపోతే ఎలాగని నిలదీసింది. కార్యక్రమాలు ప్రసారం అయ్యాక అయ్యో అని బాధపడితే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించింది. వీటి విషయంలో తాము కళ్లుమూసుకుని ఉండబోమని హెచ్చరించింది. బిగ్‌బాస్‌ షో ప్రసారం కావడం లేదన్న కారణంతో తాము స్పందించకుండా ఉండలేమని తేల్చి చెప్పింది. బిగ్‌బాస్‌ లాంటి షోల ప్రసారానికి ముందు సెన్సార్‌ చేసే విషయంలో కేంద్రానికి తగిన సూచనలు చేసే అంశంపై పరిశీలన చేస్తామని వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌, స్టార్‌ మా టివి ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎన్‌డేమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేసింది. బిగ్‌బాస్‌ షోకు వ్యాఖ్యాత, సినీ హీరో అక్కినేని నాగార్జునకు కూడా నోటీసులిచ్చింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ, జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయితో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.యువత నిర్వీర్యం అయ్యే విధంగా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ షో ప్రసారాన్ని నిలుపుదల చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ సినీ నిర్మాత, సోషల్‌ వర్కర్‌ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పిల్‌ దాఖలు చేశారు. మా టివి తరఫున సీనియర్‌ న్యాయవాది సివి మోహన్‌రెడ్డి వాదిస్తూ.. ఇష్టం లేని ప్రసారాల్ని చూడొద్దన్నారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదిస్తూ, బిగ్‌బాస్‌ షో ప్రదర్శిస్తే తీవ్ర నష్టమన్నారు.