న్యూయార్క్: అమెరికాలో అతిపెద్ద హెల్త్ కేర్ సంస్థ కైజర్ లో ఉద్యోగులు బుధవారం ఉదయం నుంచి సమ్మెకు దిగారు. కంపెనీతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమవడంతో 75 వేల మంది మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రుల నుంచి వారు వాకౌట్ చేశారు. అమెరికా చరిత్రలో అతి పెద్ద సమ్మెల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని కొయిలేషన్ ఆఫ్ కైజర్ పర్మినెంట్ యూనియన్లు తెలిపాయి. పని ఒత్తిడి పెరిగిపోతున్నందున డిపార్టుమెంట్‌లో తగినంత సిబ్బందిని నియమించాలని వారు కోరుతున్నారు. ఈ సమ్మెతో కైజర్ హాస్పిటల్స్ స్తంభించిపోయాయి. కాలిఫోర్నియా, కొలరాడో, ఆరెగావ్, వర్జీనియా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, వాషింగ్టన్‌లలో హెల్త్ కేర్ సెంటర్లు, మెడికల్ ఆఫీసుల్లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. మిగతా రాష్ట్రాల్లోనూ సమ్మె మొదలైంది. శనివారం దాకా ఇది కొనసాగవచ్చని భావిస్తున్నారు. సమ్మె చేస్తున్నవారిలో నర్సులు, ఎమర్జెన్సీ డిపార్టుమెంట్ టెక్నిషియన్లు, రేడియాలజీ టెక్నిషియన్లు, ఎక్స్‌రే టెక్నిషియన్లు,, రెస్పిరేటరీ థెరపిస్టులు, మెడికల్ అసిస్టెంట్లు, ఫార్మాసిస్టులు ఉన్నారు. సిబ్బంది కొరత తీవ్రంగా వెంటాడుతుండడంతోబాటు, అధ్వానమైన పని పరిస్థితుల, రోగులకు సదుపాయాలు దిగజారుతుండం వంటివి పరిష్కరించాలన్నా, ఉద్యోగులకు మెరుగైన వేతనాలు చెల్లించాలన్నా ఈ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని కైజర్ యూనియన్లు కోరుతున్నాయి. కైజర్ సంస్థ అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో 600 మెడికల్ కార్యాలయాలు, 39 హాస్పిటల్స్‌ను నిర్వహిస్తోంది. వీటి ద్వారా కోటి 30 లక్షల మంది రోగులకు సేవలందిస్తున్నది.