Oct 04,2023 16:05
  • వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు
  • కాకినాడలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం
  •  పాల్గొన్న ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కమిషనర్ నాగ నరసింహారావు, అధికారులు.

ప్రజాశక్తి-కాకినాడ : ప్రతి పేదవానికి మెరుగైన ఆరోగ్య సేవలు అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని కాకినాడ ఎంపీ వంగా గీతా పేర్కొన్నారు. స్థానిక కొండయ్య పాలెం లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభమైంది. సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వంగా గీత మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య రంగంలో ఏపీలో అమలు చేస్తున్న పాలనా సంస్కరణలు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చాయన్నారు. పట్టణ ప్రాంతాలలో యూ పీ హెచ్ సి ల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రెండు వేల జనాభాకు వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు, పోస్టుల భర్తీ వంటి ఎన్నో చర్యలు సీఎం తీసుకున్నారన్నారు. 24 గంటలూ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయడమే సీఎం లక్ష్యమన్నారు.

 కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్య, వైద్యం, గృహ నిర్మాణం సీఎం ప్రాధాన్యతలు గా పేర్కొన్నారు. ఒక వైద్యుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో వైయస్సార్ పాలన ద్వారా చూసామన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎంగా తండ్రికి మించిన పరిపాలన అందిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ప్రతి అర కిలోమీటర్ కు ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోగలిగామని, వీటివల్ల పేద ప్రజలకు మరింత దగ్గరగా ఆరోగ్య సేవలు అందుతున్నాయన్నారు. ఐదు డివిజన్లోని 28 వేల కుటుంబాలను ప్రభుత్వ వైద్య సిబ్బంది స్వయంగా కలిసి సర్వే చేసి, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారన్నారు. సుమారు 170 మందికి కంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి కళ్ళజోళ్ళు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. 

 కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని 13 పట్టణ ప్రాథమిక  ఆరోగ్య కేంద్రాల పరిధిలో  జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇళ్లకు వచ్చే  ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బంది కి  ఆరోగ్య సమాచారాన్ని అందించి ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. నిపుణులైన వైద్యుల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంతోపాటు,  అవసరమైతే మెరుగైన వైద్యం కోసం తోడ్పాటునందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కౌడా మాజీ చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైయస్సార్సీపీ నగర అధ్యక్షురాలు, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న,ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం. ఏసుబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ పృద్వి చరణ్, మాజీ కార్పొరేటర్లు కొలగాని దుర్గాప్రసాద్, కర్రి శైలజ, బాలాప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.