Aug 06,2023 20:54

క్రీడాకారులతో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప, అన్నమయ్య అధ్యక్షులు పోతుల వెంకటరామిరెడ్డి

 కడప అర్బన్‌ : నగరంలోని డీఎస్‌ఎ క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి హ్యాండ్‌ బాల్‌ సీనియర్‌ విభాగం ఎంపికలకు చక్కటి స్పందన లభించింది. ఈ ఎంపికలకు ముఖ్యఅతిథిగా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప, అన్నమయ్య అధ్యక్షులు పోతుల వెంకటరామిరెడ్డి విచ్చేసి ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు బాగా సాధన చేసి రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలని సూచించారు. హ్యాండ్‌ బాల్‌ క్రీడలో జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలని కోరారు. జిల్లా ఒలంపిక్‌ సంఘం అధ్యక్షులు కె.ఎన్‌.సమరనాథరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను క్రమశిక్షణ, నిరంతర సాధన, క్రీడాస్ఫూర్తి విజేతలుగా నిలుపుతాయన్నారు. జియోన్‌ వ్యాయామ కళాశాల చైర్మన్‌ రాజరత్నం ఐజాక్‌ మాట్లాడుతూ క్రీడాకారుల అభివృద్ధికి క్రీడాసంఘాలు కృషి చేయాలని సూచించారు. ఎపి వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు బి.శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు గెలవాలన్న పట్టుదల, కసి ఉంటేనే ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించగలరన్నారు. క్రీడాకారుల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న హ్యాండ్‌ బాల్‌ సంఘం కృషిని ఆయన అభినందించారు. జిల్లా హ్యాండ్‌ బాల్‌ సంఘం కార్యదర్శి సింధూరి, ఆర్గనైజింగ్‌ సెక్రటరి శివప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు ఈనెల 19, 20 తేదీల్లో ఒంగోలులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులకు క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా ఎంపికలను ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప, అన్నమయ్య కార్యదర్శి కొండూరు జనార్దనరాజు, కోశాధికారి దేవతి రవీంద్రనాథ్‌, హ్యాండ్‌ బాల్‌ శిక్షకుడు అబ్దుల్‌ మునాఫ్‌, సీనియర్‌ క్రీడాకారులు సాయికిశోర్‌రెడ్డి, బసిరెడ్డి, పవన్‌కుమార్‌, కోటేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు.