Jan 08,2023 14:03

హవాయి   :   స్థానిక కిలాయుయా అగ్నిపర్వతం మళ్లీ బద్ధలైంది. జనవరి 5 నుండి ఈ అగ్నిపర్వతం బద్ధలవుతూనే ఉంది. గత నవంబర్‌ లో దీనికి సమీపంలోనే ఉన్న 'మౌనాలోవా' అగ్ని పర్వతం పేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'కిలాయుయా' అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడుతోంది. భూమిపై ప్రస్తుతం అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వాతాల్లో కిలాయుయా ఒకటి.

ప్రపంచంలోనే హవాయిలో అత్యధికంగా క్రియాశీల అగ్ని పర్వతాలు ఉన్నాయి. మొత్తం 6 అగ్ని పర్వతాలు ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నాయి. అమెరికాకు చెందిన హవాయి పసిఫిక్‌ మహా సముద్రంలో ఉన్న దీవుల సముదాయం. ఇక్కడ ఒక్కో దీవి ఒక్కో అగ్నిపర్వతాన్ని కలిగి ఉంది. భూమి ఏర్పడిన తర్వాత 70 మిలియన్‌ సంవత్సరాల నుంచి ఈ అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉంటున్నాయి.

హవాయిలోని వాల్కానో నేషనల్‌ పార్క్‌ లోని కిలాయుయా జనవరి 5న విస్పోటనం చెందడం ప్రారంభించింది. అగ్నిపర్వత శిఖరం వద్ద లావా ప్రవహిస్తోందని.. అగ్నిపర్వతం విస్పోటనం కావచ్చని గురువారం యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే హెచ్చరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద అగ్ని పర్వతం అయిన మౌనాలోవా నవంబర్‌ 7,2022న, 38 ఏళ్ల తరువాత తొలిసారి పేలింది. రెండు వారాల పాటు అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడింది. ప్రస్తుతం కిలాయుయా గతేడాది ఏప్రిల్‌లో విస్ఫోటనం చెందింది. ఆ ఏడాది ఆగస్టు వరకు ఇలాగే పేలుళ్లు సంభవించాయి. ఈ సమయంలో వందలాది ఇళ్లు నాశనం అయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు మరోసారి కిలాయుయా అగ్నిపర్వతం విస్పోటనం చెందుతోంది. 2018లో కిలౌయా విస్ఫోటనంతో 700 కంటే ఎక్కువ నివాసాలు నాశనమయ్యాయి.