May 07,2023 00:52

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరావు

ప్రజాశక్తి -గోపాలపట్నం : హుదూద్‌ తుపాన్‌ సమయంలో సర్వం కోల్పోయిన నిరుపేదలకు తక్షణమే ఇళ్లు మంజూరుచేయాలని సిపిఎం గోపాలపట్నం డివిజన్‌ కమిటీ కార్యదర్శి బలివాడ వెంకటరావు డిమాండ్‌ చేశారు. హుదూద్‌ తుపాన్‌ బాధితుల ఆధ్వర్యాన గోపాలపట్నంలోని సిఐటియు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2014లో తెలుగుదేశం ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి కొమ్మాది సర్వేనెంబర్‌ 83లో జి ప్లస్‌ త్రీ పద్ధతిలో ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. ఎనిమిదేళ్లు గడిచినా ఇంకా అవి నిర్మాణ దశలోనే ఉన్నాయని ఎద్దేవాచేశారు. ఇప్పటికే లబ్ధిదారులందరూ రూ.10 వేలు చొప్పున డీడీలు చెల్లించారని తెలిపారు. రాజకీయాలతో జగన్‌ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. దీనిపై వ్యక్తిగతంగా దరఖాస్తులను కలెక్టర్‌కు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 8వ తేదీన గోపాలపట్నం సిఐటియు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు ఇచ్చేందుకు లబ్ధిదారులందరూ రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు ఒమ్మి లక్ష్మి, అంచనాల రమణమ్మ, జీలకర్ర లక్ష్మి, సాడి కొండమ్మ, అప్పికొండ కుసుమకుమారి పాల్గొన్నారు.