ప్రజాశక్తి - గుంటూరు లీగల్ : అప్పు డబ్బు వివాద నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమాన విధిస్తూ నాలుగో అదనపు అసిస్టెంట సెషన్ జడ్జి ఎం.కుముదిని శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. గడ్డం సుజాత తన భర్తతో కలిసి గుంటూరు అమరావతి రోడ్డులోని ఆంజనేయపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి అబ్బాయి, అమ్మాయి సంతానం కాగా ఇద్దరికీ వివాహం చేశారు. సుజాత తన అన్నయ్య కుమారుడు మున్నంగి రమేష్‌రెడ్డికి పదేళ్ల క్రితం రూ.50 వేలు అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. రమేష్‌రెడ్డి తనకున్న ఆస్తులు మొత్తం అమ్ముకున్నాడు. సుజాత అప్పు మాత్రం తీర్చులేదు. దీంతో సుజాత గట్టిగా ప్రశ్నించగా డబ్బులు ఇవ్వనని రమేష్‌రెడ్డి తేల్చి చెప్పాడు. సుజాత చెల్లెలు కుమారుడు వంగల సాంబిరెడ్డి, రమేష్‌రెడ్డి, శంకరరెడ్డి మందు తాగుతూ స్నేహంగా ఉంటారు. ఈ క్రమంలో 2018 ఏప్రిల్ 25న సుజాత ఇంటికి వంగల సాంబిరెడ్డి వెళ్లి రమేష్‌రెడ్డి డబ్బులు ఇవ్వడని, ఏమి చేసుకుంటారో చేసుకోవాలని చెప్పాడు. ఆ సమయంలో సుజాత ఇంట్లో ఉన్న ఆమె కుమారుడు నరసింహారెడ్డికి, సాంబిరెడ్డికి వివాదం కావడంతో సుజాత ఇద్దరినీ చెరొక దెబ్బ కొట్టి అక్కడ నుంచి పంపించారు. ఈ నేపథ్యంలో 2018 ఏప్రిల్ 26న రాత్రి పది గంటల సమయంలో సుజాత ఇంటికి వంగల సాంబిరెడ్డి, రమేష్‌రెడ్డి, శంకరరెడ్డి వెళ్లారు. శంకరరెడ్డి కత్తితో విచక్షణారహితంగా సుజాతను పొడిచాడు. ఆమె గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. దీనిపై అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం పోలీసులు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణకు ముందే సాంబిరెడ్డి, రమేష్ రెడ్డి మృతి చెందాడు. శంకరరెడ్డిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరుపున ఆకుల జ్యోష్ణ వాదించారు. సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంలో కానిస్టేబుల్ కె.శివనాగేశ్వరరావు సహకరించారు.










