Apr 06,2023 21:45

ప్రజాశక్తి - నూజివీడు రూరల్‌
            నూజివీడు రూరల్‌ సర్కిల్‌ పరిధిలోని బొద్దనపల్లి మామిడితోటలో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నూజివీడు డిఎస్‌పి ఎ.అశోక్‌కుమార్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... మైలవరానికి చెందిన నాగమణి నాలుగేళ్ల క్రితం భర్తతో విడిపోయి ఆగిరిపల్లి మండలం సీతారామపురానికి చెందిన పాలకుర్తి గోపితో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో బొద్దనపల్లికి చెందిన కోటేశ్వరరావుతో నాగమణి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో నాగమణి తిరిగి గోపి దగ్గరికి వెళ్లిపోవాలనుకుంది. ఇందుకు కోటేశ్వరరావు ఒప్పుకోకపోవడంతో గోపి, నాగమణి పథకం ప్రకారం ఐదో తేదీ అర్ధరాత్రి మామిడితోటలో పాకలో నిద్రిస్తున్న కోటేశ్వరరావుపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌పి ఆదేశాల మేరకు డిఎస్‌పి పర్యవేక్షణలో రూరల్‌ సిఐ ఆర్‌.అంకబాబు ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్‌ఐ చంటిబాబు తన సిబ్బందితో కలిసి నూజివీడు మండలం చెక్‌పోస్ట్‌ వద్ద నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ సమావేశంలో సిఐ ఆర్‌.అంకబాబు, రూరల్‌ ఎస్‌ఐ టి.రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్‌ఐ చంటిబాబు పాల్గొన్నారు.