Jun 17,2023 00:34

మాట్లాడుతున్న సిఐ నారాయణరావు

ప్రజాశక్తి- నక్కపల్లి:మండలంలోని పెదతీనార్ల గ్రామానికి చెందిన హత్య కేసు నిందితుడు మేరుగు లోవరాజును శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ నారాయణరావు తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడారు. మండలంలో పెదతీనార్ల గ్రామానికి చెందిన మృతుడు కారే రమణ చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మృతుడు కారే రమణ తాత, ముద్దాయి మెరుగు లోవరాజు తాత ఇరువురు అన్నదమ్ములు. ఇరువురు ఆస్తి పంపకాల్లో మేరుగు లోవరాజు కుటుంబానికి 60 సెంట్లు భూమి ఎక్కువగా వచ్చిందని ఆ భూమి తనదని కారే రమణ (మృతుడు ) ఈ విషయమై తరచూ గొడవలు పడేవారు. ఈనెల 13న సాయంత్రం 6 గంటల సమయంలో మృతుడు కారే రమణ, అతని అన్నయ్య అప్పన్నను 60 సెంట్లు భూమి మేరుగువాళ్ళు అనుభవిస్తున్నా నీవు ఎందుకు అడగడం లేదని ఇరువురు ఒకరిని ఒకరు తిట్టుకొని మేరుగు లోవరాజు ఇంటి దగ్గరకు రాగా, అక్కడ మేరుగు లోవరాజుని కారే రమణ చూసి తమ భూమిని మీరు ఆక్రమంగా అనుభవిస్తున్నారని, కోర్టుకు వెళ్లి ఎలాగైనా తీసుకుంటానని తిట్టగా ఇరువురికి మాట మాట పెరిగి తోసుకున్నారు. తరుచు భూమి కోసం ప్రస్తావించి ఎలాగైనా తీసుకోవాలని ప్రయత్నిస్తున్న కారే రమణను చంపితే అడ్డు తొలగిపోతుందని మెరుగు లోవరాజు క్రికెట్‌ బ్యాట్‌ను తీసుకొని రమణ తలపై బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. గాయపడిన రమణను చికిత్స అందించిన తర్వాత కేజిహెచ్‌కు తీసుకు వెళ్లగా చికిత్స పొందుతూ రమణ మృతి చెందాడు. మృతుని భార్య కారే కాసులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు లోవరాజును అరెస్టు చేశామని సిఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ ఐ శిరీష పాల్గొన్నారు .