
ప్రజాశక్తి -అనకాపల్లి
హత్య కేసులో ముద్దాయికి జీవిత కాలం ఖైదుతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ విశాఖ 12వ ఎడిజే కోర్టు తీర్పు వెలువరించింది. ఎస్పీ కార్యాలయం అందించిన వివరాల ప్రకారం... పాయకరావుపేట ఇందిరా కాలనీకి చెందిన బొల్లం రాజ్యలక్ష్మి తన భర్తతో విడిపోయి అదే గ్రామంలో ఉంటున్న తల్లితో నివాసముండేది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన రావాడ యేసు రాజ్యలక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకుని అదే గ్రామంలో లింగాల కాలనీలో సహజీవనం కొనసాగించారు. ఏడాది గడిచిన తర్వాత రాజ్యలక్ష్మిని అడ్డం తొలగించుకోవాలని ఉద్దేశంతో యేసు, అతని కుటుంబ సభ్యులు ప్రణాళిక వేశారు. ఈ నేపథ్యంలో 2015 అక్టోబర్ 1 అర్ధరాత్రి తమ ఇంటి పక్కనే ఉన్న పనస చెట్టుకు కట్టివేసి గొంతు నొక్కి, లోహపు కడియంతో ఆమెను బలంగా గడ్డం కింద కొట్టడంతో రాజ్యలక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. దీనిపై మృతురాలి తల్లికి స్థానికులు తెలియజేయడంతో ఆమె పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో నాడు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ జరిగి నేరం రుజువు కావడంతో ముద్దాయి యేసుకు జీవితకాలం ఖైదుతో పాటు రూ.5 వేలు జరిమానా, కట్టని పక్షంలో మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ 12వ ఎడిజె కోర్టు తీర్జు వెల్లడించింది. అడిషనల్ పీపీ వి.దేవానందరావు వాదనలు సమర్థిస్తూ ఈ తీర్పును వెలువరించడం పట్ల జిల్లా ఎస్పీ కెవి.మురళీకృష్ణ దర్యాప్తు అధికారులు, ఇన్‌స్పెక్టర్లు కె.వెంకట్రావు, జి.రాంబాబును, వాదనలు వినిపించిన అడిషనల్ పీపీని అభినందించారు.