ప్రజాశక్తి- అరకురూరల్:డుంబ్రిగూడ మండలంలోని కితలంగి పంచాయతీ వయా గ్రామంలో ఈనెల 3 న హత్య చేసి సజీవ దహనానికి పాల్పడిన 14 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అరకు సీఐ జి.దేముడు బాబు చెప్పారు. ఆయన అరకులోయలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.హత్య చేసిన నిందితులు, మృతుడు జి.గోవింద్ ఓకే కుటుంబానికి చెందిన వారన్నారు. వయా గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 17 -2లో గెడ్డ పక్కన ఉన్న ఒక ఎకరం భూమిపై తాత ముత్తాతల నుంచి గొడవలు జరుగుతూనే ఉండేవన్నారు.హత్యకు పాల్పడిన నిందితుల పేరు మీద ఆ భూమికి సంబంధించి పట్టా ఉందని, మృతుడు గోవింద్ కుటుంబ సభ్యులు పూర్వీకుల నుండి సాగు చేస్తున్నారన్నారు. దీంతో మృతుడు కుటుంబీకులు సాగు చేస్తున్న భూమిని తమకు అప్పగించాలని చెప్పగా మృతుడు గోవింద్ వారితో గొడవలకు దిగి ఆ భూమి ఇచ్చేది లేదని తెలిపాడు. నెల రోజులు క్రితం మతుడు గోవిందు వయా గ్రామంలోని ఉన్న ఆ ఎకరం భూమిని గవర్నమెంట్ రిసర్వేలో భాగంగా సర్వేయర్ తో తన పేరు మీద సర్వే చేయిస్తుండగా అక్కడికి నిందితులు చేరుకొని ఆ భూమి తమకు వస్తాదని తెలిపారు. ఈనెల 2న పింపాలగూడ గ్రామంలో గోవింద్ తమ భూమి జోలికి ఎవరైనా వస్తే చంపేస్తానని గ్రామంలో చెప్పుకొని తిరిగినట్లు తెలిసిందన్నారు. చంపుతానంటూ తిరుగుతుండడంతో అతని నుంచి ఎప్పటికైనా మనందరికీ ప్రాణహాని ఉండవచ్చని భయపడి, నిందితులంతా అతడిని హత్య చేసేందుకు పథకం పన్నారు. పశువులు కాస్తూ చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో గోవిందు పై కర్రాలు, గొడ్డళ్ళతో దాడి చేసి హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి తగుల బెట్టినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్యకు పాల్పడిన (14)మంది నిందితులను అరెస్టు చేశామరన్నారు .వీరిలో గొల్లోరి లొకినాద్, గొల్లోరి సోమరాజు, గొల్లోరి సుబ్బారావు, గొల్లోరి బలరాం, గొల్లోరి గణేష్, గొల్లోరి చిట్టిబాబు, గొల్లోరి గురుమూర్తి, గొల్లోరి ప్రసాద్, గొల్లోరి రాంబాబు , గొల్లోరి జలంధర్, గొల్లోరి అప్పలమ్మ , గొల్లోరి కమల, గొల్లోరి దానిమ్మతో పాటు మైనర్ బాలుడు ఉన్నారని అన్నారు. వీరికి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగుడ గూడ ఎస్‌ఐ సంతోష్ కుమార్, అరకులోయ ఎస్‌ఐ సతీష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










